లండన్: ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ యాషెస్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ లియాన్.. ఆ తర్వాత చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టిన ఈ స్పిన్నర్ ఆ తర్వాత గాయపడి చివరి వికెట్‌గా బ్యాటింగ్‌కు దిగాడు.
ఇంగ్లండ్ ముందు మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఉద్దేశంతో కండరాల నొప్పిని పంటి బిగువున భరిస్తూ.. క్రీజులోకి వచ్చిన లియాన్.. జట్టుకు విలువైన 15 పరుగులు జోడించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని 36 ఏండ్ల లియాన్.. మిగిలిన మూడు టెస్టులకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అతడి స్థానంలో మూడో టెస్టులో ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫి బరిలోకి దిగే అవకాశాలున్నాయి.