వయసు, గాయం, పటిష్ట ప్రత్యర్థి.. కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్‌ను ఇవేమీ ఆపలేకపోయాయి. అచ్చొచ్చిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో తనకు ఎదురేలేదంటూ ఈ సెర్బియా దిగ్గజం మరోసారి రుజువు చేశాడు. గత రెండు వింబుల్డన్ ఫైనల్స్‌లో తనను ఓడించి.. ఇటీవల కాలంలో తనకు కొరకరాని కొయ్యగా మారిన కార్లొస్ అల్కరాజ్తో హోరాహోరిగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్ పోరులో జొకో అనుభవం ముందు స్పెయిన్ కుర్రాడు తలవంచక తప్పలేదు. నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో అనుభవజ్ఞుడైన జొకోదే పైచేయి అయ్యింది. సెట్ సెట్‌కు తన ఆటతీరుకు మరింత మెరుగులు అద్దిన జొకో..ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 50వ సారి సెమీస్‌కు చేరాడు.
మెల్బోర్న్: టెన్నిస్ ఓపెన్ ఎరాలో మునుపెవరికీ సాధ్యం కాని విధంగా 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్.. ఆ దిశగా కీలక ముందడుగు వేశాడు. తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకో అనుభవం ముందు యువ సంచంలన కార్లొస్ అల్కరాజ్ తలవంచాడు. మెల్బోర్న్లోని రాడ్లీవర్ ఎరీనా వేదికగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ జొకో 4-6, 6-4, 6-3, 6-4తో అల్కరాజ్ను ఓడించి ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 12వ సారి సెమీఫైనల్స్‌కు చేరాడు. ఆద్యంతం హోరాహోరీగా మూడున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో విజయం కోసం కోర్టులో ఇరువురూ కొదమసింహాల్లా పోరాడారు. భారీ ర్యాలీలు, బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో అలరించిన ఇద్దరూ.. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు ముందే అభిమానులకు ఫైనల్ మజాను అందించారు.
మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అల్కరాజ్ తొలి సెట్‌ను గెలుచుకుని పైచేయి సాధించాడు. అదే సమయంలో జొకో ఎడమ కాలికి గాయం కావడంతో అతడు వైద్య సాయం తీసుకుని తిరిగొచ్చాక మొదలైంది అసలు ఆట. రెండో సెట్ ఆరంభం నుంచే తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీసిన జొకో.. మ్యాచ్‌పై పట్టు బిగించాక ఇక వెనక్కి తగ్గలేదు. రెండో సెట్లో 3-0తో ఆధిక్యంలో ఉండగా అల్కరాజ్ కూడా వరుసగా పాయింట్లు సాధించి స్కోరును సమం చేశాడు. కానీ జొకో మాత్రం వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అల్కరాజ్ పుంజుకునేందుకు ప్రయత్నించినా ఆ అవకాశమివ్వలేదు. మ్యాచ్ మొత్తమ్మీద జొకో 5 ఏస్‌లు సంధిస్తే..అల్కరాజ్ 10 కొట్టాడు.
13 బ్రేక్ పాయింట్లకు జొకో ఆరింటిని కాపాడుకుంటే..అల్కరాజ్ 11లో నాలుగుకే పరిమితమయ్యాడు. జొకో 3సార్లు డబుల్ ఫాల్ట్స్ చేయగా, స్పెయిన్ స్టార్ ఐదు సార్లు తప్పిదానికి పాల్పడ్డాడు. ఈ ఇద్దరి పోరును చూసేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం మొత్తం కిక్కిరిసిసోయింది. జొకోకు ఇది 50వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో 99వ విజయం. సెమీస్‌లో అతడు జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో క్వార్టర్స్‌లో జ్వెరెవ్ 7-6(7/1), 7-6 (7/0), 2-6, 6-1తో టామీ పాల్ (అమెరికా)ను ఓడించి సెమీస్ చేరాడు.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంక.. హ్యాట్రిక్ టైటిల్ వేటలో మరో ముందడుగు వేసింది. క్వార్టర్స్‌లో సబలెంక 6-2, 2-6, 6-3తో పవ్లిచెంకొవాను ఓడించింది. గంటా 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సబలెంక.. తొలి సెట్ గెలిచి రెండో సెట్ కోల్పోయినప్పటికీ నిర్ణయాత్మక మూడో సెట్ నెగ్గి తన కెరీర్లో పదో గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరింది. మరో క్వార్టర్స్‌లో కోకో గాఫ్ (అమెరికా)కు 5-7, 4-6తో బడోస (స్పెయిన్) షాకిచ్చింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో బోపన్న-జెంగ్ (చైనా) జంట 6-2, 4-6, 9-11తో జాన్ పీర్స్-ఒలివియా గెడెక్కి (ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడింది.