సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల ప్రపంచ రెండో ర్యాంకర్ అరియానా సబలెంక క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. అమెరికా యువ సంచలనం కోకో గాఫ్, క్రెజికోవా కూడా ముందంజ వేయగా.. పురుషుల సిగిల్స్‌లో నంబర్‌వన్ జొకోవిచ్, సిన్నెర్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అరియానా సబలెంక క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సబలెంక 6-3, 6-2తో అనిసిమోవాపై విజయం సాధించింది. 70 నిమిషాల్లో ముగిసిన పోరులో సబలెంకకు.. అనిసిమోవా ఏ స్థాయిలోనూ పోటీనివ్వలేక వరుస సెట్లలో ఇంటి బాట పట్టింది. ఆరు ఏస్‌లు కొట్టిన సబలెంక ఒక డబుల్ ఫాల్ట్ చేయగా..
అనిసిమోవా మూడు ఏస్‌లకే పరిమితమైంది. సబలెంక 18 విన్నర్లు కొట్టగా.. 11 విన్నర్లకే పరిమితమైన అనిసిమోవా 21 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కోకో గాఫ్ 6-1, 6-2 ఫ్రెచ్పై సునాయస విజయం సాధించింది. క్రెజికోవా 4-6, 6-3, 6-2తో ఆండ్రీవాపై.. కోస్త్యుక్ 6-2, 6-1తో టిమోఫీవపై గెలుపొందారు. క్వార్టర్స్‌లో కోస్త్యుక్‌తో గాఫ్, క్రెజికోవాతో సబలెంక అమీతుమీ తెల్చుకోనున్నారు.
జొకోవిచ్ రికార్డు
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో 58వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జొకో 6-0. 6-0, 6-3తో ఆడ్రియన్ మనారినోపై అలవోక విజయం సాధించాడు. ఇప్పటికే 10 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచిన జొకో.. ప్రిక్వార్టర్స్‌లో 31 విన్నర్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్‌ల్లో అత్యధికసార్లు (58) క్వార్టర్ ఫైనల్ చేరిన రోజర్ ఫెదరర్‌ను జొకో సమం చేశాడు. గంటా 44 నిమిషాల్లో ముగిసిన పోరులో జొకో 17 ఏస్‌లు కొడితే.. ప్రత్యర్థి కేవలం ఒక్క ఏస్‌కే పరిమితమయ్యాడు.
జొకో 15 అనవసర తప్పిదాలకు పాల్పడితే.. మనారినో 31 తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ ఫ్రిట్జ్‌తో జొకోవిచ్ తలపడనున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిన్నెర్ 6-4, 7-5, 6-3తో కచనోవ్‌పై.. ఐదో సీడ్ రుబ్లెవ్ 6-4, 6-7 (5/7), 6-7 (4/7), 6-3, 6-0తో డి మినార్‌పై.. ఫ్రిట్జ్ 7-6 (7/3), 5-7, 6-3, 6-3తో ఏడో సీడ్ సిట్సిపాస్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ సోమవారం ప్రిక్వార్టర్స్ బరిలో దిగనుంది.