సిడ్నీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సత్తాచాటాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 17-21, 24-22, 21-16తో చౌ తీన్ చెన్(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించాడు. 86 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సేన్ తొలి గేమ్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్నాడు. గెలువాలంటే తప్పక గెలువాల్సిన రెండో గేమ్‌లో పుంజుకున్న ఈ యువ షట్లర్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు.
ప్రపంచ ఆరో ర్యాంకర్ చైనీస్ తైపీ షట్లర్‌కు దీటైన పోటీనిస్తూ రెండో గేమ్ గెలిచి పోటీలోకి వచ్చాడు. నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ఇద్దరు షట్లర్లు 2-2, 4-4తో ముందుకు సాగారు. అయితే చెన్ను కట్టడి చేస్తూ లక్ష్యసేన్ 11-9తో ఆధిక్యం కనబరిచాడు. ఇలా ఇద్దరు కండ్లు చెదిరే స్మాష్‌లకు తోడు నెట్‌గేమ్, డ్రాప్షాట్లతో పాయింట్ల వేట కొనసాగించారు.
స్కోరు 20-20తో సమమైన క్రమంలో సేన్ కొట్టిన స్మాష్‌తో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 6-1తో ఆధిక్యం కనబరిచిన ఈ 24 ఏండ్ల యువ షట్లర్ అదే దూకుడుతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్ షట్లర్ యుషి తనాకాతో తలపడనున్నాడు.