T20 World Cup | షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ వేటను డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఘనంగా మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లోనే కంగారూలు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గ్రూప్-ఏలో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. నీలాక్షి డి సిల్వ (29) టాప్ స్కోరర్ కాగా హర్షిత మాధవి (23), అనుష్క సంజీవని (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఆసీస్ పేసర్ మేగన్ షట్ (3/12) కట్టుదిట్టమైన బంతులతో లంకకు ఆరంభంలోనే చుక్కలు చూపించింది. అనంతరం ఛేదనలో ఆసీస్.. 14.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆ జట్టు ఓపెనర్ బెత్ మూనీ (38 బంతుల్లో 43 నాటౌట్, 4 ఫోర్లు) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లు ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచినా మూనీ, పెర్రీ (17) నిలకడగా ఆడి ఆసీస్‌కు తొలి గెలుపును అందించారు. మేగన్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇంగ్లండ్ కష్టమ్మీద..
గ్రూప్-బీలో బంగ్లాదేశ్.. మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను భయపెట్టింది. ఇరుజట్ల మధ్య షార్జా వేదికగా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో గెలుపు కోసం బంగ్లా ఆఖరి వరకూ పోరాడినా ఇంగ్లండ్‌నే విజయం వరించింది. ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 97/7 వద్దే ఆగిపోయి 21 పరుగుల తేడాతో అపజయం పాలైంది. ఆ జట్టు యువ బ్యాటర్ సోబన్ మోస్త్రి (44) బంగ్లా గెలుపు ఆశలను మోసింది. కెప్టెన్ నైగర్ సుల్తానా (15)తో కలిసి ఐదో వికెట్‌కు 25 పరుగులు జోడించింది. కానీ సుల్తానా రనౌట్ అవడం బంగ్లా కొంపముంచింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మోస్త్రి మాత్రం ఒంటరిపోరాటం చేసింది. కానీ చార్లీ డీన్ వేసిన 19వ ఓవర్లో మూడో బంతికి ఆమె ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో ఆ జట్టు ఆశలు అడియాసలయ్యా యి. ఇంగ్లండ్ బౌలర్లలో స్మిత్ (2/11), స్పిన్నర్ చార్లి డీన్ (2/22) రాణించారు. అంతకుముం దు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జట్టు నిండా టీ20 స్పెషలిస్ట్ హి ట్టర్లు ఉన్నప్పటికీ ప్రత్యర్థి స్పిన్నర్ల ధాటికి 20 ఓవర్లలో 118/7కే పరిమితమైం ది. వ్యాట్ హాడ్జ్ (41) మెరుగ్గా ఆడగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫాతిమా ఖటూన్ (2/18), రితూ మోని (2/24), నహిదా అక్తర్ (2/32)చెరో రెండు వి కెట్ల చొప్పున పడగొట్టారు.