బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వరుణుడి దోబూచులాట మధ్య చివరి వరకు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. 281 పరుగుల లక్ష్యఛేదనలో 107/3తో మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. చివరకు 8 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (197 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధశతకంతో వీరోచితంగా పోరాడగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (28), అలెక్స్ కారీ (20) విలువైన పరుగులు జతచేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 3, రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి గెలుపు కష్టమే అనుకున్న దశలో ఆసీస్ గొప్పగా పోరాడింది. లియాన్ (16 నాటౌట్)తో కలిసి కమిన్స్ 9వ వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించడంతో కంగారూలు విజయం సాధించారు. ఖవాజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.