ఢిల్లీ: స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలి వన్డే సిరీస్ నెగ్గాలన్న భారత మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. ప్రత్యర్థి 413 పరుగుల కొండంత లక్ష్యాన్ని తమ ముందుంచినా ఆఖరివరకూ పోరాడిన ఉమెన్ ఇన్ బ్లూ.. 369 రన్స్ వద్ద ఆగిపోయి 43 పరుగుల తేడాతో అపజయం వైపు నిలిచింది. ఆసీస్ మ్యాచ్‌తో పాటు 2-1తో సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఇరుజట్ల బ్యాటర్లు పోటాపోటీగా బంతిని బాదినా.. చివరికి విజయం ఆస్ట్రేలియానే వరించింది.
శనివారం ఢిల్లీ వేదికగా హోరాహోరీగా సాగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బెత్ మూనీ (75 బంతుల్లో 138, 23 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు శతకానికి తోడు జార్జియా వోల్ (68 బంతుల్లో 81, 14 ఫోర్లు), ఎల్లీస్ పెర్రీ (72 బంతుల్లో 68, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కడంతో 47.5 ఓవర్లలో 412 పరుగుల రికార్డు స్కోరు చేసింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే అత్యుత్తమ స్కోరు. 57 బంతుల్లోనే మూనీ శతకం పూర్తైంది. ఆ జట్టు బ్యాటర్లు ఏకంగా 60 బౌండరీలు బాదడంతో భారత బౌలర్లు తేలిపోయారు.
అరుంధతి 3 వికెట్లు తీసినా 8.5 ఓవర్లలో 86 రన్స్ సమర్పించుకోగా ఏస్ పేసర్ రేణుకా సింగ్ (9 ఓవర్లలో 79/2) సైతం నిరాశపరిచింది. భారీ ఛేదనలో భారత్ కూడా తక్కువేమీ తిన్లేదు. ఓపెనర్ స్మృతి మంధాన (63 బంతుల్లో 125, 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) వరుసగా రెండో శతకంతో మెరువగా దీప్తి శర్మ (58 బంతుల్లో 72, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 52, 8 ఫోర్లు), స్నేహ్ రాణా (35) పోరాడారు. కానీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి 47 ఓవర్లలో 369 రన్స్‌కు భారత్ ఆలౌట్ అయింది. మూడో వన్డేలో ఇరుజట్లూ కలిపి 781 పరుగులు చేయడం గమనార్హం. స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మూనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.