చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వర్షం కారణంగా ఎనిమిది సార్లు మ్యాచ్‌లు రద్దయితే అందులో ఆసీస్ ఆరింటిలో భాగమైంది.
Champions Trophy | లాహోర్: చాంపియన్స్ ట్రోఫీని వరుణుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. రాకరాక 29 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఆతిథ్య హోదాలో కనీసం ఒక్క మ్యాచ్ గెలువని పాక్ మెగాటోర్నీ నుంచి నిష్క్రమించగా, వర్షాల కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి కల లేకుండా పోయింది. శుక్రవారం కీలకమైన ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు మరోమారు అడ్డంకిగా నిలిచాడు. ఎడతెరిపిలేని వర్షంతో లాహోర్ గడాఫీ స్టేడియం తడిసి ముద్దవడంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆసీస్, ఆఫ్గన్ మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో ఆసీస్(0.475) నాలుగు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించగా, ఆఫ్గన్(-0.990) మూడో స్థానంలో ఉంది. శనివారం ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ద్వారా మరో సెమీస్ బెర్తు ఖరారు కానుంది. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే..గ్రూపు-బి టాపర్‌గా సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. ఒక వేళ ఇంగ్లండ్ 207 పరుగుల భారీ తేడాతో సఫారీలను ఓడిస్తే..అప్పుడు మూడో స్థానంలో ఉన్న అఫ్గన్‌కు అవకాశం లభిస్తుంది. ఒక రకంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆఫ్గన్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. యువ బ్యాటర్ సెదీకుల్లా అటల్(85), అజ్మతుల్లా ఒమర్జాజ్(67) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్ రహ్మనుల్లా గుర్జాబ్(0) డకౌట్‌గా వెనుదిరుగగా, రహ్మత్‌షా(12), కెప్టెన్ హష్మతుల్లా(20), ఇబ్రహిం(22) నిరాశపరిచారు. ఆసీస్ బౌలింగ్‌ను దాడిని దీటుగా ఎదుర్కొంటూ సెదీకుల్లా తన కెరీర్లో రెండో అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. అయితే కంగారూ బౌలర్లు పుంజుకోవడంతో ఓ దశలో ఆఫ్గన్ 182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అజ్మతుల్లా 5 భారీ సిక్స్‌లతో దుమ్మురేపాడు. నాథన్ ఎలీస్ బౌలింగ్‌లో అజ్మతుల్లా 102 మీటర్ల దూరంలో కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి అజ్మతుల్లా ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఆసీస్ బౌలర్లు 17 వైడ్లు వేసి మూల్యం చెల్లించుకున్నారు. డ్వారిష్(3/47)కు మూడు వికెట్లు దక్కాయి.
నిర్దేశిత లక్ష్యఛేదనలో వరుణుడు అంతరాయం కల్గించే సమయానికి ఆసీస్ 12.5 ఓవర్లలో 109/1 స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్(59) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మరో ఓపెనర్ షార్ట్(20) నిరాశపరిచినా..హెడ్ మాత్రం తనదైన శైలిలో ఆఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ స్మిత్(19) నాటౌట్‌గా నిలిచాడు.