గాలె: ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలెదుర్కుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. శ్రీలంకతో గాలెలో జరుగుతున్న మొదటి టెస్టులో మాత్రం సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్లో ఖవాజా (352 బంతుల్లో 232, 16 ఫోర్లు, 1 సిక్స్) ద్విశతకంతో కదం తొక్కాడు. అతడి కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కాగా లంకేయులపై ద్విశతకం చేసిన తొలి ఆసీస్ క్రికెటర్గా ఖవాజా రికార్డులకెక్కాడు.
అతడితో పాటు స్టీవ్ స్మిత్ (141), అరంగేట్ర ఆటగాడు జోష్ ఇంగ్లిష్ (102) శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 654 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన లంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 44 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.