John Buchanan : భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈసారి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy 2024-25) హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది. గడిచిన మూడు పర్యాయాలు టీమిండియా చేతిలో కంగుతిన్న ఆసీస్ ట్రోఫీపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్(John Buchanan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి భారత జట్టు విజయావకాశాలు యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మీదే అధారపడి ఉన్నాయని బుకానన్ అన్నాడు.
‘టెస్టు క్రికెట్లో యశస్వీ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. అతడొక ఉత్సాహవంతమైన యువ క్రికెటర్. ఎవరికైనా అతడి ఆట చూడాలనిపిస్తుంది. అయితే.. ఈ యంగ్‌స్టర్ ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో ఆడలేదు. అంతేకాదు బౌన్స్ ఎక్కువయ్యే పెర్త్ పిచ్ మీద కూడా అతడు బ్యాటింగ్ చేయలేదు. సో.. మా దేశంలోని పరిస్థితులకు, పిచ్‌లకు తగ్గట్టు అతడు తన ఆటను ఎలా మార్చుకుంటాడు? అనేది బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది’ అని బుకానన్ వెల్లడించాడు.
టెస్టు క్రికెట్లో టీ20 తరహాలో రెచ్చిపోయే యశస్వీ ఇంగ్లండ్ మీద ఏ విధంగా దంచాడో తెలిసింది. ఒక డబుల్ సెంచరీతో కలిపి ఏకంగా 712 రన్స్ బాదేశాడు. స్వల్ప కెరీర్లోనే ఈ చిచ్చరపడిగు 9 టెస్టుల్లోనే మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలతో 1,028 పరుగులు సాధించి దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు.
ఇక 2020-21లో రోహిత్ శర్మ(Rohit Sharma) జోడీగా శుభ్‌మన్ గిల్ ఆడాడు. ఇప్పుడు గిల్ స్థానంల్ యశస్వీ ఇన్నింగ్స్ ఆరంభఢించనున్నాడు. దాంతో, నయావాల్ ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) బదులు శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఆడే అవకాశముంది. వీళ్లిద్దరి తర్వాత ఆస్ట్రేలియాను మరోసారి భయపెట్టేందుకు రిషభ్ పంత్(Rishabh Pant) ఎలాగూ ఉన్నాడు.
ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22న మొదలవ్వనుంది. ఐదు టెస్టుల సిరీస్‌గా సాగుతున్న ఈ ట్రోఫీ జనవరి 7 వరకూ జరగనుంది. టీమిండియా చేతిలో మూడుసార్లు ఓడిన ఆసీస్ ఈసారి బీజీటీ ట్రోఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక, ఈ సిరీస్ కోసం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సుదీర్ఘ బ్రేక్ తీసుకుంటున్నాడు. రెండోసారి తండ్రి కాబోతున్న ఈ స్పీడ్‌స్టర్ దాదాపు 8 వారాలు అంటే రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.