Mollywood Me Too | జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళీ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నది. మహిళా నటులపై లైంగిక వేధింపులకు సంబంధించిన రిపోర్టు ఇండస్ట్రీని వణికిస్తున్నది. ఈ క్రమంలో నటుడు, రాజకీయ నేత ముఖేశ్‌పై సైతం ఆరోపణల నేపథ్యంలో కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. దాంతో ఆయన గురువారం కోర్టును ఆశ్రయించగా.. ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ముఖేశ్‌కు మధ్యంతర ఉపశమనం కల్పించింది. చట్టం నుంచి తప్పించుకునేందుకు ఆయనకు అవకాశం చాలా తక్కువని, తప్పించుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 3 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని విచారణ అధికారిని ఆదేశించింది.
బుధవారం రాత్రి కొచ్చి నగరంలోని పోలీస్ స్టేషన్లో ముఖేశ్‌కు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన పిటిషన్లో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని కోరారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ దురుద్దేశంతో కూడుకున్నదని, కల్పితమని పేర్కొన్నారు. తన రాజకీయ, సినీ కెరీర్‌ను నాశనం చేసేందుకు కేసు పెట్టారని ఆరోపించారు. మీటు ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి ముఖేశ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆయనకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ కే హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టాక మహిళ నటీమణుల ఆరోపణల నేపథ్యంలో ముఖేశ్, జయసూర్య, సిద్ధిఖీ సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేశారు.