మెల్బోర్న్: అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ వీడ్కోలు పలికింది. తన 13 ఏండ్ల కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు లానింగ్ గురువారం ప్రకటించింది. సుదీర్ఘ కెరీర్లో ఆసీస్ తరఫున ఆరు టెస్టులు, 103 వన్డేలు, 132 టీ20లు ఆడిన లానింగ్ అన్ని ఫార్మాట్లలో కలిపి 8352 పరుగులు చేసింది. ఇందులో ఏడు ప్రపంచకప్ టైటిళ్లు ఉండటం విశేషం. అయితే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన లానింగ్..ప్రపంచ వ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో కొనసాగుతానని పేర్కొంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగాలన్న నిర్ణయం కఠినమైందే. కానీ ఇదే సరైన సమయంగా భావించాను. సుదీర్ఘంగా 13 ఏండ్ల పాటు ఆసీస్ జట్టుకు సేవలందించాను. కెరీర్లో సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉన్నాను’ అని అంది. లానింగ్ గైర్హాజరీలో త్వరలో భారత పర్యటనకు రానున్న ఆసీస్ జట్టు అలీస్సా హిలీ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియా అందించిన అత్యుత్తమ క్రికెటర్లలో లానింగ్ ఒకరని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే తెలిపాడు.