Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు ఆసీస్ సారథి ప్రకటించింది. స్వదేశంలో త్వరలో భారత జట్టులో సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతానని మంగళవారం అలీసా వెల్లడించింది. పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నందున తాను టీమిండియాతో జరుగబోయే టీ20 సిరీస్‌లో మాత్రం ఆడబోనని ఆమె స్పష్టం చేసింది.
ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2010లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తను తొలి మ్యాచ్ ఆడింది. వికెట్ కీపర్‌గా, విధ్వంసక ఓపెనర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీలీ మూడేళ్ల క్రితం కెప్టెన్సీ చేపట్టింది.
మేగ్ లానింగ్ వీడ్కోలు పలికిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తన.. యాషెస్ సిరీస్‌లో 16-0తో ఇంగ్లండ్‌పై అద్భుతమైన విజయాల రికార్డు నెలకొల్పింది. హీలీ సారథ్యంలో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో, నిరుడు భారత్‌లో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరింది. ఈ 16 ఏళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకూ ఈ వెటరన్ బ్యాటర్ 162 టీ20లు, 126 వన్డేలు, 11 టెస్టులు ఆడింది. వికెట్ల వెనకాల చురుకుగా కదులుతూ టీ20ల్లో 126 మందిని ఔట్ చేసింది.
Alyssa Healy is set to retire from all cricket at the end of the summer: https://t.co/4j3HV50o2m pic.twitter.com/fwNF8S40ET
— cricket.com.au (@cricketcomau) January 12, 2026
‘త్వరలో భారత జట్టుతో ఆడబోయే సిరీసే నా కెరీర్లో చివరిది. సో.. మనసులో ఎన్నో భావోద్వేగాలు కలుగుతున్నాయి. నా దేశానికి ఆడడాన్ని ఇప్పటికీ ఇష్టపడుతున్నా. అయితే.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాలోని పోరాట స్ఫూర్తి ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే.. వీడ్కోలుకు సమయం వచ్చేసిందని భావిస్తున్నా. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో నేను ఆడడం లేదు. సన్నద్ధతకు సమయం తక్కువ ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నా. స్వదేశంలో భారత్‌తో వన్డే, ఏకైక టెస్టులో కెప్టెన్సీ వహించి నా కెరీర్‌ను ఘనంగా ముగించాలని అనుకుంటున్నా.
Alyssa Healy will bow out as the most prolific ‘keeper in the women’s international game, as well as one of Australia’s most productive run scorers: https://t.co/4j3HV50o2m pic.twitter.com/AL3kNqJ2Xh
— cricket.com.au (@cricketcomau) January 12, 2026
నేను కచ్చితంగా నా సహచరులను మిస్ అవుతాను. వారితో కలిసి టీమ్ సాంగ్ పాడుతూ ఇన్నింగ్స్ ఆరంభించడం వంటివి మిస్ అవుతాను. ఆస్ట్రేలియా తరఫున ఆడడం నాకు జీవితంలో దక్కిన అత్యంత గొప్ప గౌరవం. బంగారం, ఆకుపచ్చ రంగు జెర్సీలో చివరి సిరీస్ ఆడబోతున్నందుకు గర్వంగా ఉంది’ అని హీలీ తన రిటైర్మెంట్ వార్తను వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బెర్గ్ మహిళా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన హీలీని ప్రశంసించాడు. మైదానం లోపలా, వెలుపలా యువతరాన్ని ప్రభావితం చేసేలా నడుచుకున్న ఆమెను ‘ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరి’గా అభివర్ణించాడు.
Nobody did it like Alyssa Healy ❤️🥹 pic.twitter.com/wwvtxhIX6f
— Australian Women’s Cricket Team 🏏 (@AusWomenCricket) January 13, 2026
నిరుడు భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రెండు శతకాలు బాదిన హీలీని మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారీ ధర పలుకుతుందని అందరూ ఊహించారు. కానీ, అనూహ్యంగా ఆసీస్ సారథిని ఏ ఫ్రాంచైజీ కొనలేదు. దాంతో.. ఒకింత బాధకు గురైన హీలీ ఉన్నట్టుండి వీడ్కోలు వార్తలో అందరికీ షాకిచ్చింది.