IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుండడం అభిమానులకు తీపి కబురే. కానీ, కొన్ని జట్లు మాత్రం కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయే అవకాశముంది. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు తదుపరి మ్యాచుల్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ జట్లకు చెందిన ప్లేయర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇండో -పాక్ కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించడంతో తదుపరి మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
మే 16వ తేదీ నుంచి లీగ్‌ను పునరుద్దరించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే.. ఇప్పటికే సొంత దేశాలకు వెళ్లిపోయిన క్రికెటర్లకు ఆయా బోర్డులు అనుమతి ఇస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్ పునరుద్ధరణ నేపథ్యలో క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఐపీఎల్ 18వ సీజన్లో ఆడుతున్న మా క్రికెటర్లు సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లను ఐపీఎల్ ఆడాల్సిందిగా మేము ఒత్తిడి చేయం. ఒకవేళ వాళ్లు భారత్‌కు వెళ్లేందుకు సిద్ధపడకుంటే వాళ్ల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. పేసర్ మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్‌తో పాటు పలువురు ఆసీస్ ఆటగాళ్లు ఆదివారం సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఒకవేళ ఆస్ట్రేలియా ప్లేయర్లు రిటర్న్ రాకుంటే.. తొలి టైటిల్‌పై కన్నేసిన ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆస్ట్రేలియా బోర్డు తమ ఆటగాళ్ల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ను వారం రోజులు వాయిదా వేస్తున్నట్టే మే 9న బీసీసీఐ ప్రకటించింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే లీగ్‌ను మొత్తానికే రద్దు చేయడం లేదా దక్షిణాది రాష్ట్రాలో నిర్వహించాలని భారత బోర్డు భావించింది. అయితే.. మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దాంతో, మే 16, 17 నుంచి లీగ్‌ను జరిపేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఇదే విషయమై ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమాచారాన్ని ఇచ్చింది బీసీసీఐ. హైదరాబాద్‌లో క్వాలిఫయర్ 1, కోల్‌కతాలో క్వాలిఫయర్ 2 జరిగే అవకాశముంది. మే 30 లేదా జూన్ 1 నిర్వహించే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోనుంది.