Operation Sindoor | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్ర దాడిని చూస్తే తన రక్తం మరుగుతున్నదని 1965 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో నేరు గా పాల్గొన్న తెలంగాణ బిడ్డ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో చెప్పారు. నాడు ఆయన పాకిస్థాన్ బులెట్లకు ఎదురొడ్డి మరీ శత్రు సైనికులను సంహరించారు. నేటి యుద్ధం సందర్భంగా ఆనాటి తెగువను ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా మరోసారి ఆయన స్మరించుకున్నారు.
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత మీకు ఏమనిపించింది?
ఆ రోజు నా మనసు ఎంత బాధపడిందో నాకే తెలుసు. కొత్తగా పెండ్లయిన జంటను విడదీసి మరీ కాల్చి చంపారని తెలిసిన తర్వాత ఈ వృద్ధాప్యంలోనూ ఓ సైనికుడిగా నా రక్తం మరిగింది.ఒక్కసారిగా నేను అనుభవించిన యుద్ధం కండ్లముందు కదలాడింది. అమాయకులను మతం అడిగి మరీ కాల్చారని టీవీల్లో బాధితులు చెప్పింది విన్న తర్వాత నా మనసు కలిచివేసింది. ఆ దురాగతానికి మన వాళ్ల ప్రతీకారచర్య తప్పకుండా ఉంటుందని అనిపించిం ది. సామాన్య ప్రజలను చంప డం పెద్ద పొరపా టు. ఏకే 47తో అమాయలను మతం అడిగి చంప డం అమానుషం, అనాగరికం కిందకే వస్తుంది. దానికి వాళ్లు కచ్చితంగా అనుభవిస్తారు.
‘ఆపరేషన్ సిందూర్’తో మీ మనసు శాంతించిందా?
– ‘ఆపరేషన్ సిందూర్’తో నేనొక్కడ్నే కాదు, యావత్ భారతం కొంత శాంతించింది. కానీ, శాశ్వత శాంతి కావాలని దేశం మొత్తం కోరుకుంటున్నది. అమాయకులు యుద్ధంలో బలికూడదనే ప్రాథమిక సూత్రం పాటించాలి. మన సైన్యం కూడా ఆపరేషన్ సిందూర్‌లో అదే చేసింది. ఇప్పటికి ఈ ప్రతీకార చర్య సమర్థనీయమే. పాకిస్థాన్ వంటి దేశంతో యుద్ధమంటే ఒకేసారి కొట్టిపడేయాలి. దశలవారీగా యుద్ధం చేయాలనుకోవడం మంచిది కాదు. త్రిముఖ వ్యూహంతో ఒకేసారి కొట్టాలి.
మనోళ్ల సన్నద్ధత ఎలా ఉందనిపిస్తున్నది?
మన వాళ్లు చాలా తెలివితో ఆలోచిస్తున్నారు. చాలా గొప్ప విషయం. చాలా సంమయనంతో ముందుకు వెళ్తున్నారు.. అది అభినందించదగిన అంశం. అలా చేయడమంటేనే ముందస్తు సన్నద్ధతో ఉన్నారని అర్థం. ఎలా వెళ్లాలి? సర్ప్రైజ్గా ఎలా కొట్టాలి? ఎంత గట్టిగా కొట్టాలి? ఎంత తెలివిగా తిరిగి రావాలి? అనే వ్యూహం అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర చాలా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ల ప్రణాళిక వాళ్లకు ఉన్నది. ఈ విష యం మీద మేం తక్కువగా మాట్లాడాలి. ‘ఆపరేషన్ సిందూర్’తో దేశమంతా ఒక్కటే మాట మాట్లాడింది. సైనికుడిగా నేను గర్విస్తున్నాను.
ఇప్పటి యుద్ధ వాతావరణాన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తున్నది?
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న యుద్ధం మీడియా క్రియేట్ చేసిందే. ఏవేవో గ్రాఫిక్స్ పెట్టి.. మన దేశ సరిహద్దుల్లో యుద్ధం జరుగుతున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఇలా చేయడమంటే ప్రత్యర్థులను మనమే అప్రమత్తం చేసినట్టు అవుతుంది. మనవాళ్లు ప్రతీకార దాడి చేశారు. అది కూడా సాధారణ పౌరులపై కాదు. కేవలం ఉగ్రవాదులు ఉన్న స్థావరాలపైనే దాడులు జరిగాయి. దానిని ఆధారం చేసుకొని కొన్నిచోట్ల పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది.
వారికి గుణపాఠం చెప్పొద్దంటారా?
అది నూటికి నూరుపాళ్లు జరగాలి. ఇప్పటికే గుణపాఠం చెప్పాం. మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఈ సారి మనవాళ్లు చాలా గట్టిగానే కొడతారు. ఆ దెబ్బకు పాక్ విలవిల్లాడటం ఖాయం. చేసేది చేస్తూనే ఉండాలి. కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెళ్లాలి.. కొట్టాలి.. రావాలి. ఇలాంటప్పుడు ఇజ్రాయెల్ వంటి టెక్నిక్‌ను మనం ఉపయోగించుకోవాలి. వాళ్లు కూడా అంతే టార్గెట్ ఫిక్స్ చేస్తే మాటలు ఉండవు. అన్నీ చేతలే. అమెరికా బిన్‌లాడెన్‌ను కొట్టినట్టు కొట్టాలి. మనవాళ్లు కూడా ఆ టెక్నిక్‌ను ఉపయోగించాలి. ఇప్పడు కొట్టినదానికంటే మరింత టెక్నిక్‌తో ఫినిష్ చేయాలి.
మీ కాలికి ఇంకా నాటి యుద్ధం మిగిల్చిన జ్ఞాపకం ఉన్నట్టుంది? క్లుప్తంగా చెప్తారా?
1961లో నా మొదటి పోస్టింగ్ డెహ్రాడూన్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ దగ్గర నేరుమాల గ్రామం. 1965 ఇండో-పాక్ వార్ ఖేమకరణ్ సెక్టార్లో జరిగినప్పుడు నేరుగా యుద్ధంలో పాల్గొన్నా. ఇప్పుడున్న మేజర్ జనరల్ రావత్‌తో కలిసి పనిచేశా. మా ఇద్దరిదీ ఒకటే రైఫిల్. అక్కడ సిఫాయిలు మొత్తం గూర్కాలే ఉంటారు. ఆఫీసర్లుగా మేము ఉంటాం. అప్పడు 22 రోజులపాటు యుద్ధం చేశాం. నా కుడి కాలికి బుల్లెట్ తగిలింది. చివరి యుద్ధం 1971లో జరిగింది.
ఆర్మీలో తెలుగువాళ్లు తక్కువున్నట్టున్నరు?
అవును. మన ఇండియన్ ఆర్మీలో తెలుగు రాష్ర్టాల నుంచి ప్రాతినిధ్యం చాలా తక్కువ. అయితే, మనవాళ్లకే ధైర్యం ఎక్కువ. అందరికంటే చాలా సాహసవంతులు. ఏపీ, తెలంగాణ సైనికులు చాలా ధైర్యవంతులు, తెలివిగల వాళ్లు కూడా. మిగతావారితో పోల్చితే మన వారికి పట్టుదల, మొండితనం చాలా ఉంటుంది. మన తెలుగు రాష్ర్టాల నుంచి ఆర్మీలో ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి.
ఖర్జూరపండ్లు, రొట్టె తిని మాత్రమే యుద్ధం చేశారని విన్నాం నిజమేనా?
అప్పట్లో మేం యుద్ధంలో ఉన్నప్పుడు విజయంపైనే మా దృష్టంతా ఉండేది. ఏం తింటున్నామో, తాగుతున్నామో కూడా తెలిసేది కాదు. ఫుడ్ ఎప్పడు వస్తుందో కూడా తెల్వకపోయేది. బుల్లెట్లతో పాటు రొట్టె, ఖర్జూర పండ్లు, మామిడికాయ పచ్చడి తీసుకెళ్లే వాళ్లం. ఫుడ్ లేని పక్షంలో రొట్టె మామిడికాయపచ్చడి వేసుకొని తిని వెళ్లేవాళ్లం. ఒక్కోరోజు ఖర్జూరపండ్లు తిని కొట్లాడేవాళ్లం. తెలుగువాడు తెలుగువాడే. అప్పట్లో మా ధైర్యమే వేరు. నాతో పాటు ఆ యుద్ధం చేసిన వారిలో ముగ్గురం బతికే ఉన్నాం.
అప్పటి యుద్ధ సాంకేతికత.. ఇప్పటి సాంకేతికత చూస్తే మీకు ఏమనిపిస్తుంది?
యుద్ధ పరికరాల్లో అంచనా వేయలేనన్ని మార్పులు వచ్చాయి. యుద్ధపరంగా సాంకేతికతను సమకూర్చుకోవడంలో, అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకోవడంతో మనకు మనమే సాటి. సైనికుల్లో ఎడ్యుకేషన్ పెరిగింది. టెక్నాలజీని బాగా వాడుతున్నారు. యుద్ధంలో ఆర్టిఫిషియల్ సాంకేతికత పెరిగింది. యుద్ధమంటే ఇప్పుడు మరోలా ఉంటున్నది. మిగతా దేశాలతో పోల్చితే భారత్ చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి కొడితే ఒకేసారి గట్టిగా కొట్టాలనేది నా అభిప్రాయం. చర్యకు ప్రతిచర్య తప్పడు.. జైహింద్.
అప్పటి యుద్ధానికి, ఇప్పటి యుద్ధాలకు మీరు ఎలాంటి తేడా గమనించారు?
అప్పుడు సైనికులే ఫేస్ టు ఫేస్ యుద్ధాలు చేసేవారు. చనిపోతే యుద్ధాల్లో సైనికులు చనిపోయేవారు. ఏ దేశాలు కూడా పౌరుల జోలికి వెళ్లేవి కాదు. చాలా తక్కువ ఘటనల్లో అప్పుడు సాధారణ పౌరులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు యుద్ధం వేరు. యుద్ధం డెఫినిషన్ వేరు. ఇప్పుడు యుద్ధం జరిగితే సాధారణ పౌరులు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. 1965లో యుద్ధం చేసినప్పడు మేం సైనికులుగానే తలపడ్డాం.
ఒకవేళ పాకిస్తాన్ నేరుగా యుద్ధానికి వస్తే పరిస్థితి ఏంటి? ఎలా ఎదుర్కొంటే త్వరగా విజయం సాధించొచ్చు?
పాకిస్తాన్ నేరుగా యుద్ధానికి వస్తే ఆ దేశానికి పెను నష్టం వాటిల్లుతుంది. మన దగ్గరున్న ఆయుధ సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం ముందు ఆ దేశం ఎటూ తలపడబోదు. మన మీదకు నేరుగా వస్తే మాత్రం నాది ఒక్కటే సూచన. త్రివిధ దళాలు ఒకేసారి యుద్ధరంగంలోకి దిగితే చాలా త్వరగా విజయం మనం సొంతం అవుతుంది. మన వైపు నష్టం తక్కువగా ఉంటుంది. అటువైపు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ విషయం పాక్‌కు కూడా తెలుసు. ఇప్పటికే మనవాళ్లు నైతికంగా నీళ్లు, ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యం వంటి అన్నింటిని ఆపేసి పరోక్షయుద్ధంలో విజయం సాధించారు కూడా.