England Vs Australia | సౌతంప్టన్ (ఇంగ్లండ్): ఇంగ్లండ్ పర్యటనను ఆస్ట్రేలియా గెలుపుతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో కంగారూలు.. 28 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 59, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (26 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. జోష్ ఇంగ్లిస్ (37) కూడా వేగంగా ఆడటంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.
అనంతరం ఛేదనలో ఆతిథ్య జట్టు 19.2 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గైర్హాజరీలో సారథ్య పగ్గాలు అందుకున్న ఫిల్ సాల్ట్ (20) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. లివింగ్‌స్టోన్ (27 బంతుల్లో 37, 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరుచేయగా మిగిలినవారూ చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ (3/28) మూడు వికెట్లు తీయగా జంపా, హెజిల్వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.