Ashes 2023 | ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. బౌలర్ల హవా సాగుతున్న లీడ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్ల సమ ఉజ్జీలుగా నిలిచాయి. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఆరు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు 116 పరుగులకు 4 వికెట్లు కోల్పోయారు. శనివారం హెడ్, మార్ష్ ఏ మేరకు పోరాడుతారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
లీడ్స్: బౌలర్ల జోరు సాగుతున్న యాషెస్ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), మార్నస్ లబుషేన్ (33) పర్వాలేదనిపించగా.. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (2) విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మిషెల్ మార్ష్ (17)తో పాటు ట్రావిస్ హెడ్ (18) క్రీజులో ఉన్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న కంగారూలు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (26 పరుగులు)తో కలుపుకొని ఓవరాల్‌గా 142 పరుగుల ముందంజలో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ 2, బ్రాడ్, వోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 68/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ జట్టు చివరకు 237 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించగా.. మోయిన్ అలీ (21), మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; ఒక ఫోర్, 3 సిక్సర్లు) అతడికి కాస్త సహకరించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 6 వికెట్లు పడగొట్టాడు.
స్టోక్స్ పోరాటం..
గత రెండు మ్యాచ్‌ల్లో బజ్‌బాల్ ఆటతీరుతో దెబ్బతిన్న ఇంగ్లండ్.. మూడో మ్యాచ్‌లో పైచేయి సాధించే అవకాశాన్ని కాలదన్నుకుంది. క్రితం రోజు స్కోరు వద్దే రూట్ (19) వెనుదిరగగా.. గత మ్యాచ్‌లో వివాదాస్పద రీతిలో రనౌట్ అయిన బెయిర్‌స్టో (12) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మోయిన్ అలీ, క్రిస్ వోక్స్ (10) ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఇంగ్లండ్ 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా క్రీజులో నిలిచిన కెప్టెన్ స్టోక్స్.. దంచికొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడికి మార్క్ వుడ్ బాదుడు తోడవడంతో ఇంగ్లండ్ కాస్త కుదుటపడింది. ఎనిమిదో వికెట్‌కు వుడ్‌తో కలిసి 25 పరుగులు జోడించిన స్టోక్స్ బ్రాడ్‌తో తొమ్మిదో వికెట్‌కు 32, పదో వికెట్‌కు రాబిన్సన్తో 38 రన్స్ జోడించి ఆసీస్ ఆధిక్యం తగ్గించే ప్రయత్నం చేశాడు. మార్ఫి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన స్టోక్స్.. స్మిత్ పట్టిన క్యాచ్‌తో చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.