ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలో అజేయంగా నిలవడమే గాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో లీగ్ స్టేజ్‌ను ముగించింది. శనివారం ఇండోర్‌లో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆ జట్టు.. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ (7/18) కెరీర్ ఉత్తమ ప్రదర్శన నమోదుచేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలారు. కెప్టెన్ లారా వోల్వార్డ్ (31) టాప్ స్కోరర్ కాగా కింగ్ స్పిన్ మాయకు ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 16.5 ఓవర్లలోనే దంచేసింది. బెత్ మూనీ (42), జార్జియా (38*) రాణించారు. కింగ్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా ఈ మ్యాచ్‌తో సెమీస్‌లో తలపడబోయే జట్లు కూడా తేలాయి. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో తలపడనుండగా రెండో సెమీస్ భారత్, ఆసీస్ మధ్య జరుగనుంది. ఇక వన్డే ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో ఆడనుండగా టీమ్ఇండియా.. బంగ్లాదేశ్‌తో ఆడే మ్యాచ్‌తో గ్రూప్ దశకు తెరపడనుంది.