Gabba Test: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్.. ప్రపంచ క్రికెట్లో ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్‌ను చూసేవారికి ఈ ఆసీస్ ప్లేయర్లు ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకించి వివరణలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. అగ్రశ్రేణి జట్లు కూడా భయపడే ఈ జట్టును చూస్తే పసికూనలకైతే వణుకే. ఇలాంటి జట్టుతో టెస్టు ఆడిన వెస్టిండీస్ ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. వీళ్లతో పోల్చితే కరేబియన్ జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఏకంగా ఏడుగురికి పట్టుమని పది టెస్టులు ఆడిన అనుభవం కూడా లేదు. కానీ ఈ అనుభవలేమితో ఉన్న జట్టే ప్రపంచ క్రికెట్లో అత్యంత స్ట్రాంగ్ టీమ్‌గా ఉన్న కంగారూలను కంగారెత్తించింది.
విండీస్ టెస్టు జట్టులో ఆడుతున్న ఆటగాళ్లలో కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌తో పాటు కీమర్ రోచ్, అల్జారీ జోసెఫ్‌లు మాత్రమే అనుభవజ్ఞులు. వికెట్ కీపర్ జోషువా డిసిల్వ 26 టెస్టులలో ప్రాతినిథ్యం వహించాడు. ఈ నలుగురు మినహా మిగిలిన ఏడుగురిలో ఒక్కరు కూడా పది టెస్టులకు మించి ఆడలేదు. తేజ్ నారాయన్ చందర్ పాల్ 9 టెస్టులు ఆడగా క్రిక్ మెకంజీ, కావెమ్ హాడ్జ్ లు తలా రెండు టెస్టులు ఆడారు. అలిక్ అథనాల్ మూడు టెస్టులు ఆడగా జస్టిన్ గ్రీవ్స్, షెమారి జోసెఫ్‌లకు తలా ఒక్క టెస్టు మాత్రమే ఆడిన అనుభవం ఉంది. కెవిన్ సింక్లయిర్కు గబ్బా టెస్టే అరంగేట్ర టెస్టు. ఇంతటి అనుభవరాహిత్యంతో కూడిన ఈ జట్టు.. ప్రపంచ క్రికెట్లో తనదైన దూకుడు ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న జట్టుకు షాకిచ్చిందంటే అది కచ్చితంగా గొప్ప విషయమే.
Shamar Joseph. Remember the name. pic.twitter.com/64K7QeeqeT
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
గబ్బా టెస్టులో విండీస్ విజయం గాలివాటంగా వచ్చిందైతే కాదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 311 పరుగులు చేయగా హాడ్జ్ (71), జోషువా డిసిల్వ (79), కెవిన్ సింక్లయిర్ (50)లు అర్థ సెంచరీలతో రాణించగా చందర్‌పాల్ (21), మెకంజీ (21), అల్జారీ జోసెఫ్ (32)లు తలా ఓ చేయి వేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో జోసెఫ్ నాలుగు వికెట్లు తీయగా రోచ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోసెఫ్‌తో పాటు సింక్లయిర్లు తలా ఒక వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ తరఫున మెకంజీ (41), హాడ్జ్ (29), గ్రీవ్స్ (33)లు రాణించారు. అనంతరం ఛేదనలో ఆసీస్‌కు షెమార్.. ఏడు వికెట్ల తేడాతో చుక్కలు చూపించగా.. జోసెఫ్ రెండు వికెట్లు తీయగా గ్రీవ్స్ ఒక్క వికెట్ సాధించాడు.
WEST INDIES HAS WON A TEST MATCH AT GABBA 🤯
– Shamar Joseph is the hero. pic.twitter.com/d9zqVfcOpP
— Johns. (@CricCrazyJohns) January 28, 2024
2021లో భారత్ కూడా అనుభవరాహిత్యమున్న జట్టుతోనే సంచలన విజయం అందుకుంది. కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టు.. అప్పుడే కెరీర్ ఆరంభించిన శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ, నటరాజన్ వంటి ఆటగాళ్లతో ఆడి అద్భుత విజయం అందుకున్న విషయం విదితమే. ఇప్పుడు విండీస్ కూడా అదే ఫీట్‌ను రిపీట్ చేసింది.