SL Vs AUS Test | శ్రీలంక పర్యటన కోసం ఆస్ట్రేలియా గురువారం జట్టును ప్రకటించింది. శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడనున్నది. ఈ రెండు మ్యాచులు గాలే స్టేడియంలోనే జరుగనున్నాయి. లంకలోని పిచ్‌లను దృష్టిలోపెట్టుకొని క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. ఆసిస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌కు లంక సిరీస్‌కు విశ్రాంతినివ్వగా.. స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దాదాపు 22 నెలల తర్వాత టెస్టుల్లో మళ్లీ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. చివరిసారిగా 2023 మార్చిలో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా పని చేశాడు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ తర్వాత ఉద్వాసనకు గురైన నాథన్ మెక్‌స్వీనికి మళ్లీ చోటు కల్పించింది. ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడనున్నది.
ప్రస్తుత కెప్టెన్ కమ్మిన్స్ కొడుకు పుట్టడంతో స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆస్ట్రేలియా యువ ఆటగాడికి శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసింది. 21 ఏళ్ల కూపర్ కొన్నోలీని ఎంపిక చేసింది. 16 మంది సభ్యుల జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్, పార్ట్-టైమ్ స్పిన్ బౌలర్లు ఉన్నారు. ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ కొన్నోలీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్ నాథన్ లియాన్‌కు తోడుగా టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్‌ను సైతం ఎంపిక చేసింది. స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్ ఫాస్ట్‌బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. సీన్ అబాట్, బ్యూ వెబ్‌స్టర్ రూపంలో ఇద్దరు పేస్ బౌలింగ్ వేయగలిగిన ఆల్ రౌండర్లు ఉన్నారు. జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ కీపింగ్ చేయనున్నారు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో రాణించిన శామ్ కాన్స్టాస్కు సైతం చోటు దక్కింది. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులతో పాటు ఒక వన్డే సైతం ఆడుతుంది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నది. శ్రీలంక జట్టు ఐసీసీ ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయింది.
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, శామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చగ్నే, నాథన్ లియాన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.