ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో లంకను గెలిచిన సఫారీలు మలి పోరులో కంగారూల భరతం పట్టారు. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఆసీస్‌ను ఆడుకున్నారు. సుదీర్ఘ ప్రపంచకప్ చరిత్రలో కంగారూలకు భారీ ఓటమిని కట్టబెట్టారు. డికాక్ సూపర్ సెంచరీతో పోరాడే స్కోరు అందుకున్న దక్షిణాఫ్రికా..రబాడ, ఎంగ్డీ పదునైన పేస్‌కు తోడు మహారాజ్ స్పిన్‌తో ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది.
70 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కమిన్స్ సేన..సఫారీలకు ఏ దశలోనూ పోటీనివ్వలేక స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. చెలరేగుతాడనుకున్న వార్నర్ ఆదిలోనే నిష్క్రమిస్తే…ఆపద్భాందవుడు స్మిత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. లబుషేన్, స్టార్క్ పోరాటం ఆసీస్‌ను ఒడ్డున పడేయలేకపోయింది. ఫలితంగా సఫారీలు వరుసగా రెండో విజయంతో ప్రపంచకప్ వేటను కొనసాగిస్తున్నారు.
లక్నో: ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు ఏకపక్షమైంది. అటల్ బిహారీ వాజపేయ ఏకానా స్టేడియంలో గురువారం ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్ క్వింటన్ డికాక్(106 బంతుల్లో 109, 8ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు మార్క్మ్ (56) రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 311/7 స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (2/34), స్టార్క్(2/53) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్..రబాడ(3/33), మహారాజ్(2/30), షంసీ(2/38), జాన్సెన్(2/54) ధాటికి 40.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్(46) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మెగాటోర్నీలో వరుసగా రెండో సెంచరీతో కదంతొక్కిన డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో దక్షిణాఫ్రికా టాప్‌లోకి దూసుకెళ్లగా, ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు ఓటములతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నది.
డికాక్ దంచెన్: టాస్ గెలిచిన ఆసీస్..దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కంగారూలు ఇక్కడే పప్పులో కాలేశారు. పిచ్‌పై పూర్తి అవగాహన ఉన్న సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆది నుంచే ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో లక్నో తరఫున ఆడిన అనుభవమున్న డికాక్..కళాత్మక షాట్లతో కంగారూలను ఇబ్బందిపెట్టాడు. కెప్ణెన్ బవుమా(35) అండగా చేసుకుంటూ డికాక్ తన ఇన్నింగ్స్‌లో 8ఫోర్లు, 5 భారీ సిక్స్‌లతో చెలరేగాడు. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను పార్ట్‌టైమ్ స్పిన్నర్ మ్యాక్స్‌వెల్..బవుమాను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. దీంతో తొలి వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. డస్సెన్(26) స్వల్ప స్కోరుకే వెనుదిరుగగా, మార్క్మ్ మరోమారు బ్యాటు ఝులిపించాడు. డికాక్, మార్క్మ్ కలిసి ఆసీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. సఫారీల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఎన్ని రకాలుగా బౌలింగ్ మార్చిమార్చి ప్రయోగించినా ఆశించిన ఫలితం దక్కలేదు. మాక్స్వెల్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన డికాక్..క్లీన్‌బౌల్డ్ కావడంతో ఆసీస్ ఊపిరీ పీల్చుకుంది. ఈ మెగాటోర్నీలో వరుసగా రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్న డికాక్..జట్టు భారీ స్కోరుకు కారణమయ్యాడు. అయితే ఆఖర్లో ఆసీస్ బౌలింగ్ కట్టుదిట్టం చేయడంతో పరుగుల రాక మందగించింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా మన్ననలు అందుకున్న ఆసీస్..ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు నేలపాలు చేసి అప్రతిష్ఠ మూటగట్టుకుంది.
కంగారూలు క్యూ: నిర్దేశిత లక్ష్యఛేదనలో ఆసీస్‌కు సరైన శుభారంభం దక్కలేదు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మిచెల్‌మార్ష్(7) మరోమారు నిరాశపరిచాడు. జాన్సెన్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు దూకుడు కనబరుస్తాడనుకున్న వార్నర్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఆసీస్ 27 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్(19) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా, ఇంగ్లిస్(5)సూపర్ స్వింగ్‌తో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న స్టొయినిస్(5) డికాక్ క్యాచ్‌తో భారంగా నిష్క్రమించాడు. భారీ షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెడుతాడనుకున్న మాక్స్‌వెల్‌ను మహారాజ్ తన బుట్టలో వేసుకున్నాడు. దీంతో ఆసీస్ 70 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో లబుషేన్, స్టార్క్(27) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయినా ఏ మాత్రం పట్టువదలని సఫారీలు తమ బౌలింగ్ దళంతో కంగారూల పీక పిసికారు.
ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇది తొలిసారి. 2019 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ చేతిలో ఓడిన ఆసీస్..ప్రస్తుతం భారత్, సఫారీలపై పరాజయం పాలైంది. 40 ఏండ్ల క్రితం 1983లో భారత్ చేతిలో 118 పరుగుల తేడాతో ఓడటం ఇప్పటి వరకు ఆసీస్‌కు చెత్త ఓటమి
వన్డే ప్రపంచక్ చరిత్రలో భారీ తేడాతో ఓటమిపాలు కావడం ఆస్ట్రేలియాకు ఇది తొలిసారి.
వన్డే ప్రపంచకప్‌లో 70 పరుగుల లోపు సగం వికెట్లు కోల్పోవడం ఆసీస్‌కు ఇది తొలిసారి
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆసీస్‌కు ఏదీ కలిసిరాలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాల్సింది పోయి..దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతోనే కంగారూల పని అయిపోయింది. డికాక్ సూపర్ సెంచరీతో చెలరేగిన వేళ..ఆసీస్ బౌలర్లుచేష్టలుడిగిపోయారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటైన ఆసీస్ ఏకంగా ఐదు క్యాచ్‌లు విడిచిపెట్టి తమ పేలవ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఛేదనలో ఓపెనర్లు విఫలం కాగా, సంచలన నిర్ణయాలతో స్మిత్, స్టొయినిస్ భారంగా పెవిలియన్ చేరారు.
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 311/7(డికాక్ 109, మార్క్మ్ 56, మ్యాక్స్‌వెల్ 2/34, స్టార్క్ 2/53),
ఆస్ట్రేలియా: 40.5 ఓవర్లలో 177 ఆలౌట్(లబుషేన్ 46, స్టార్క్ 27, రబాడ 3/33, మహారాజ్ 2/30).