AUS vs NED | నెదర్లాండ్స్ బౌలర్ బస్ డీ లీడ్ వన్డేలలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా లీడ్ నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లీడ్.. పది ఓవర్లు వేసి ఏకంగా లీడ్ రెండు వికెట్లు మాత్రమే పడగొట్టి ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. లీడ్ భారీగా పరుగులిచ్చుకోవడంతో ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా కాస్త ఊపిరిపీల్చుకున్నాడు. కొన్ని నిమిషాల ముందు వరకూ ఈ చెత్త రికార్డు జంపా పేరిటే ఉండేది.
వన్డేలలో వందకు పైగా పరుగులిచ్చుకున్న బౌలర్లలో గతంలో ఆస్ట్రేలియాకు చెందిన మిక్ లూయిస్ ప్రథమ స్థానంలో ఉండేవాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లూయిస్.. పది ఓవర్లలో 113 పరుగులు ఇచ్చాడు. ఇటీవలే అదే ఆసీస్‌కు చెందిన జంపా.. దక్షిణాఫ్రికాపైనే సెంచూరియన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లోనూ పది ఓవర్లు విసిరి 113 పరుగులిచ్చి లూయిస్ రికార్డును సమం చేశాడు.
ఈ జాబితాలో పాకిస్తాన్ వెటరన్ పేసర్ వహబ్ రియాజ్.. నాలుగో స్థానంలో ఉన్నాడు. రియాజ్.. 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 110 పరుగులిచ్చాడు. రియాజ్ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ఇంగ్లాండ్‌పై 9 ఓవర్లలోనే వికెట్లేమీ తీయకుండా 110 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆసీస్‌కు రెండో అత్యధిక స్కోరు..
ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 399 పరుగుల భారీ స్కోరు చేసిన ఆసీస్‌కు వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. అంతకంటే ముందు 2015 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 415 పరుగుల భారీ స్కోరు సాధించింది. 2019లో బంగ్లాదేశ్‌పై 381 పరుగులు చేసిన ఆసీస్.. 2007లో సౌతాఫ్రికాపై 377 పరుగులు సాధించింది.