David Warner | నెదర్లాండ్స్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న 24వ లీగ్ మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగాడు. వార్నర్‌కు ఇది ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌తోనూ శతకం బాదిన వార్నర్.. తాజాగా నెదర్లాండ్స్‌తోనూ అదే సీన్ రిపీట్ చేశాడు. 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన వార్నర్.. 91 బంతుల్లో 11 బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఈ సెంచరీతో వార్నర్.. వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ (7) తర్వాత ఆరు సెంచరీలతో సచిన్ టెండూల్కర్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.
వార్నర్‌తో పాటు స్మిత్ (71), మార్నస్ లబూషేన్ (62) లు రాణించడంతో ఆసీస్ 40 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్, గ్రీన్ వంటి హిట్టర్లు ఉన్న నేపథ్యంలో ఆసీస్ భారీ స్కోరుపై కన్నేసింది.
సెంచరీ కోసం 12 ఓవర్ల నిరీక్షణ
ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌తో కలిసి రెండో వికెట్ కు 137 పరుగులు జోడించిన వార్నర్.. సెంచరీ చేసేందుకు 12 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. స్మిత్ అవుట్ అయ్యేటప్పటికీ వార్నర్.. 60 బంతుల్లో 78 పరుగులతో ఉన్నాడు. కానీ స్మిత్ స్థానంలో వచ్చిన లబూషేన్.. వార్నర్‌కు స్ట్రైకింగ్ ఇవ్వలేదు. 78 నుంచి వందకు చేరడానికి వార్నర్ తీసుకున్నది 31 బంతులే అయినా అందుకు ఏకంగా డజను ఓవర్ల పాటు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు. లబూషేన్ తన సహజ శైలికి భిన్నంగా ధాటిగా ఆడటం మరో విశేషం. వాన్ డెర్ మెర్వ్ వేసిన 34వ ఓవర్లో లబూషేన్.. సిక్స్, రెండు బౌండరీలు బాది అర్థ సెంచరీకి చేరువయ్యాడు. ఆర్యన్ దత్ బౌలింగ్ లో 6, 4తో 60లలోకి వచ్చినా వార్నర్ మాత్రం అప్పటికీ 96 పరుగుల వద్దే ఉన్నాడు. అయితే లబూషేన్ నిష్క్రమించాక వచ్చిన ఇంగ్లిస్.. 13 పరుగులు పూర్తయ్యాక ఎట్టకేలకు వార్నర్ లీడ్ వేసిన 39వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించి శతకం పూర్తిచేశాడు. వన్డే కెరీర్లో వార్నర్‌కు ఇది 22వ శతకం. వరల్డ్ కప్‌లో అయితే ఆరోవది.