యువభారత జట్టుకు పరాభవం తప్పలేదు! అద్వితీయ ప్రదర్శనతో అజేయంగా ఫైనల్‌కు చేరిన యంగ్‌ఇండియా.. తుదిపోరులో కంగారూల అడ్డంకిని అధిగమించలేకపోయింది!
నిరుడు సీనియర్ ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో రోహిత్‌సేన పరాజయం పాలవగా.. ఇప్పుడు అదే తరహాలో యంగ్ఇండియాకూడా ఆసీస్ చేతిలోనే ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది!
U-19 World Cup | బెనోనీ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్‌లో అపజయం ఎరగకుండా.. ఫైనల్ చేరిన యువభారత జట్టుకు చివర్లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో యంగ్‌ఇండియా 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టి వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన యంగ్‌ఇండియా.. అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్ (55; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. కెప్టెన్ వైబ్గెన్ (48), హ్యారీ డిక్సన్ (42), ఒలీవర్ (46*) రాణించారు.
భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం అండర్ ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్‌ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఆదర్శ్ (47), మురుగన్ అభిషేక్ (42) కాస్త పోరాడగా.. కెప్టెన్ ఉదయ్ సహరాన్ (8), సచిన్ దాస్ (9), అర్షిన్ (3), ప్రియాన్షు (9), అవవెల్లి అవనీశ్ రావు (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మహ్లీ బ్రాడ్‌మన్, మెక్‌మిలన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఆసీస్ పేసర్ క్వెన ఎంపెకాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
నిరుడు సొంతగడ్డపై జరిగిన సీనియర్ వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ సారథ్యంలోని భారత జట్టు భారీ ఆశలతో అడుగుపెట్టి.. అందుకు తగ్గట్లే పరాజయం ఎరగకుండా ఫైనల్ చేరింది. ఇప్పుడు అచ్చం అదే రీతిలో యువ భారత జట్టు ఒక్క ఓటమి లేకుండానే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. లీగ్దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌సేన విజృంభిస్తే.. తాజాగా యంగ్‌ఇండియా కూడా గ్రూప్ దశ, సూపర్ సిక్స్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. సీనియర్ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీల మోత మోగిస్తే.. తాజా టోర్నీలో ముషీర్ ఖాన్, సచిన్ దాస్, ఉదయ్, అర్షిన్ శతకాలు నమోదు చేసుకున్నారు.
నవంబర్ 19న దాదాపు లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలువగా.. తాజా పోరులోనూ అదే సీన్ రిపీట్ అయింది. అప్పుడు టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 240 పరుగులకు పరిమితమైతే.. ఇప్పుడు 254 పరుగుల లక్ష్యఛేదనలో యంగ్‌ఇండియా తడబడింది. టోర్నీ ఆసాంతం పరుగుల వరద పారించిన కోహ్లీ, రాహుల్, రోహిత్ తుదిపోరులో ఓ మోస్తరుగా ఆడగా.. తాజా మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యమే దెబ్బకొట్టింది. దీంతో ఆస్ట్రేలియా ఇటీవలి కాలంలో వరుసగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, వన్డే ప్రపంచకప్, అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్‌పై విజయాలు సాధించింది.
4 అండర్-19 ప్రపంచకప్‌లో యువభారత జట్టు రన్నరప్‌గా నిలువడం ఇది నాలుగోసారి. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఫైనల్ చేరిన యంగ్‌ఇండియా 5 సార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది.
ఆస్ట్రేలియా: 253/7 (హర్జాస్ సింగ్ 55, వైబ్గెన్ 48; రాజ్ లింబాని 3/38, నమన్ 2/63),
భారత్: 43.5 ఓవర్లలో 174 ఆలౌట్ (ఆదర్శ్ 47, అభిషేక్ 42; మహ్లీ 3/15, మెక్‌మిలన్ 3/43).