Shakib Al Hasan | ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ఎంపీ, ఆ దేశ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ అయిన షకీబ్ అల్ హసన్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఢాకాలోని అడబొర్ పోలీస్ స్టేషన్లో రఫికుల్ ఇస్లాం అనే వ్యక్తి తన కొడుకు మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు షకీబ్ కూడా ఓ కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు జరిపిన ఉద్యమంలో రఫికుల్ కుమారుడు రూబెల్ ప్రాణాలు కోల్పోయాడు.
అయితే తన కొడుకు మరణానికి హసీనాతో పాటు మరో 158 మంది బాధ్యులను (వీరిలో అధికంగా అవామీ లీగ్ ఎంపీలే ఉన్నారు) చేస్తూ ఇస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు షకీబ్‌ను 27వ నిందితుడిగా చేర్చారు. ఆగస్టు 7న రూబెల్ మరణించగా జూలై 26 నుంచి ఆగస్టు 9 దాకా షకీబ్.. కెనడాలో గ్లోబల్ టీ20 లీగ్ ఆడటం గమనార్హం.