న్యూఢిల్లీ: స్టేడియాల్లో ప్రముఖ సింగర్ల లైవ్ కన్సర్ట్ల పరంపర వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్..గచ్చిబౌలి స్టేడియంలో సంగీతా విభావరి మర్చిపోకముందే ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దిల్జిత్ దొసాంజీ రెండు రోజుల పాటు నిర్వహించిన ‘దిల్ లుమినాటి’ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది.
ఈ లైవ్ కన్సర్ట్‌తో నెహ్రూ స్టేడియం మొత్తం చెత్తతో డంపింగ్ యార్డ్‌గా మారిపోయింది. తాగి పడేసిన బీర్ బాటిళ్లకు తోడు కూల్‌డ్రింక్స్ గ్లాస్లు, కవర్లు, ప్లేట్లతో చెత్త పేరుకుపోయింది. దేశంలో స్టేడియాల పరిస్థితి ఇదంటూ పలువురు సోషల్‌మీడియాలో ఫొటోలతో పోస్ట్ చేయడంతో భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈనెల 31 జరిగే క్రీడాటోర్నీ కోసం స్టేడియాన్ని సిద్ధంగా ఉంచుతామని సాయ్ ప్రకటించింది. లైవ్ కన్సర్ట్ నిర్వహణపై అథ్లెట్లు తీవ్రస్థాయిలో సాయ్పై విరుచుకుపడుతున్నారు.