ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఓటమన్నదే లేకుండా సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.. సోమవారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణ కొరియాను చిత్తుచేసి వరుసగా రెండోసారి, ఈ టోర్నీలో ఆరోసారి ఫైనల్ చేరింది. భారత హాకీ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘సర్పంచ్ సాబ్’ (కెప్టెన్ హర్మన్‌ప్రీత్) రెండు గోల్స్‌తో అదరగొట్టగా ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ తలా ఓ గోల్ కొట్టారు. ఈ విజయంతో భారత్ మంగళవారం జరిగే ఫైనల్లో ఆతిథ్య చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి సెమీస్‌లో చైనా.. మాజీ చాంపియన్ పాకిస్థాన్‌ను ఓడించి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరింది.
హులన్‌బుయిర్ (చైనా): భారత హాకీ జట్టు మరోసారి అద్భుత ప్రదర్శనతో ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం హులన్‌బుయిర్ వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో భారత్.. 4-1తో దక్షిణ కొరియాను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా సాగుతున్న ‘మెన్ ఇన్ బ్లూ’.. సెమీస్‌లో అదే దూకుడుతో ఆడింది. ఇది వరకే లీగ్ దశలో దక్షిణ కొరియాను చిత్తుచేసిన మన కుర్రాళ్లు సెమీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేశారు. భారత్ తరఫున ఉత్తమ్ సింగ్ (13వ నిమిషంలో), జర్మన్‌ప్రీత్ సింగ్ (32) తలా ఓ గోల్ చేయగా సారథి హర్మన్‌ప్రీత్ సింగ్ (19, 45) రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ప్రత్యర్థి జట్టు తరఫున యంగ్ జిహున్ (33) ఒక్కడే గోల్ కొట్టగలిగాడు.
ఆట ఆరంభం అయిన కొద్దిసేపటికే తొలి క్వార్టర్ 13వ నిమిషంలోనే అరెజీత్ సింగ్ అందించిన బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపి భారత్‌కు తొలి గోల్ అందించాడు. తొలి క్వార్టర్ ముగిసిన వెంటనే కొరియాకు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా వాటిని వినియోగించుకోవడంలో ఆ జట్టు సఫలీకృతం కాలేదు. కానీ 19వ నిమిషంలో భారత్‌కు వచ్చిన అవకాశాన్ని మాత్రం సర్పంచ్ సాబ్ వృథా చేయలేదు. ఆట అర్థ భాగం ముగిసేసరికి 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. తర్వాత కూడా అదే జోరును కొనసాగించింది. 32వ నిమిషంలో ఔట్ సైడ్ సర్కిల్ నుంచి బంతిని తన అధీనంలో ఉంచుకుంటూ జర్మన్‌ప్రీత్ సూపర్ గోల్ కొట్టాడు. కానీ ఆ మరుసటి నిమిషానికే వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను జిహున్ గోల్‌గా మలవడంతో కొరియా బోణీ కొట్టింది. 45వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇది 7వ గోల్. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పైకి దండెత్తడంతో పాటు కొరియన్ల గోల్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో మన డిఫెన్స్ శ్రేణి విజయవంతమైంది.
తొలి సెమీస్‌లో చైనా.. మాజీ చాంపియన్ పాకిస్థాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఆట నిర్దేశిత సమయంలో ఇరు జట్లూ తలా ఓ గోల్ (1-1)తో సమానంగా నిలువడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో చైనా 2-0తో గెలిచి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్స్‌కు అర్హత సాధించింది.