Asia Athletics Championships | బ్యాంకాక్: భారత స్టార్ షార్ట్ పుటర్ తజిందర్పాల్ సింగ్ తూర్.. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో వరుసగా రెండోసారి పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. రెండో ప్రయత్నంలో గుండును 20.33 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచిన తజిందర్.. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేశాడు. సాబెరి మెహ్దీ (19.98 మీ.), ఇవానోవ్ (19.87 మీ.) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌదరి 9 నిమిషాలా 38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం కైవసం చేసుకుంది. యువ లాంగ్ జంపర్ శైలీసింగ్ బరిలోకి దిగిన తొలి మేజర్ ఇంటర్నేషనల్ టోర్నీలోనే రజత పతకంతో మెరిసింది. దీంతో ఈ చాంపియన్షిప్లో ఇప్పటి వరకు భారత్ 9 పతకాలు ( 5 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు) ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన అథ్లెట్లు వచ్చే నెలలో బుడాపెస్ట్ వేదికగా జరుగనున్న ప్రపంచ చాంపియన్షిప్నకు నేరుగా అర్హత సాధించనున్నారు.