Tanvi Patri | చెంగ్డూ (చైనా): ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తన్వి పత్రి చాంపియన్‌గా నిలిచింది. చైనాలోని చెంగ్డూ వేదికగా ఆదివారం జరిగిన అండర్-15 బాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 13 ఏండ్ల తన్వి.. 22-20, 21-11తో హుయెన్ ఎంగ్వుయెన్ (వియత్నాం)ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది.
34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 11-17తో వెనుకబడ్డ తన్వి.. ప్రత్యర్థి చేసిన తప్పులను రెండుచేతులా ఒడిసిపట్టుకుని ఒక్కో పాయింట్ దక్కించుకుని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో గేమ్‌లోనూ అదే ఊపుతో ఆడి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌లలోనూ తన్వి ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించడం గమనార్హం.
ఈ విజయంతో ఒడిషాకు చెందిన తన్వి.. అండర్ -15 బాలికల చాంపియన్‌షిప్ గెలిచిన మూడో భారత షట్లర్‌గా నిలిచింది. గతంలో సమియ ఇమాద్, తస్నిమ్ మిర్ ఈ ఘనత సాధించారు. ఈ టోర్నీ అండర్-17 బాలుర చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అబ్బాయి జ్ఞానదత్తు కాంస్యం గెలుచుకున్న విషయం విదితమే.