ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022కు ఇటీవలే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టోర్నీ నిర్వహణ నుంచి శ్రీలంక తప్పుకోవడంతో ఈ ఏడాది ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహించనున్నారు. తాజాగా టోర్నీ అధికారిక ప్రసారదారు అయిన స్టార్ స్పోర్ట్స్ ఆసియా కప్ నకు సంబంధించిన ప్రోమోను తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
45 సెకండ్ల నిడివి ఉన్న ఈ ప్రోమోను విడుదల చేస్తూ ‘ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం..’ అని స్టార్ స్పోర్ట్స్ రాసుకొచ్చింది. ‘నా ఇండియా నెంబర్ వన్.. మేమిప్పుడు ఆసియా కప్ గెలవాలనుకుంటున్నాం. మా పొరుగు దేశాలు కూడా ఈ కప్ గెలవాలని కోరుకుంటున్నాయి. కానీ రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా మేం ఇక్కడికొచ్చేది గెలవడానికని వారికి చూపిస్తాం..’ అనే పాటతో ప్రోమోను ఆసక్తికరంగా తయారుచేసింది. ఆసియా కప్ మ్యాచ్‌లు స్టార్ స్టోర్స్‌తో పాటు డిస్నీ హాట్ స్టార్‌లో కూడా ప్రసారమవుతాయి.
ఆగస్టు 27 నుంచి ప్రారంభం కాబోయే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ లు పాల్గొననున్నాయి. ఆరో జట్టు కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్ లో తలపడతాయి. ఈ నాలుగు దేశాల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. ఆరో దేశంగా ఆసియా కప్ ఆడనుంది.
2016, 2018లలో జరిగిన ఆసియా కప్ ట్రోఫీలను టీమిండియానే చేజిక్కించుకుంది. ఈసారి కూడా భారత జట్టు ఫేవరెట్లుగానే బరిలోకి దిగుతున్నది. ఈ టోర్నీలో ఆగస్టు 28న భారత్-పాకిస్తాన్‌లు గ్రూప్ దశలో తలపడతాయి. టీ20 ప్రపంచకప్ కంటే ముందే దాయాదుల పోరు ఆసియా కప్‌లో వీక్షించే అవకాశం రానుండటంతో ఇరు దేశాల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The battle for Asian supremacy is 🔛. Get set to #BelieveInBlue as @ImRo45 leads #TeamIndia at the #AsiaCup2022!💙
Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/K2hcfuGeBK
— Star Sports (@StarSportsIndia) July 22, 2022