Asia Cup | యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ క్రికెట్ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తలో నిలిచింది. సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్లో విజయం సాధిందించింది. దాయాది దేశంపై వరుసగా మూడు విజయాలను నమోదు చేసింది. ఫైనల్లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా టైటిల్‌ను సాధించింది. అయితే, ఫైనల్ తర్వాత పీసీబీ చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫిని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. ఇప్పటికే బీసీసీఐ సైతం ఆయన నుంచి ట్రోఫీని ఆటగాళ్లు తీసుకోరని స్పష్టం చేసింది.
అయితే, ఈ విషయంలో రాజీనపడి పీసీబీ చైర్మన్ నఖ్వీ ట్రోఫీని, పతకాలను హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే, టీమిండియా ట్రోఫీ లేకుండానే సంబురాల్లో పాల్గొంది. మైదానంలో ఉన్న అభిమానులంతా భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. అయితే, పాకిస్తాన్ మీడియా, ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. పాకిస్తాన్ మీడియా ఈ వివాదాన్ని తమ జట్టు ఓటమికంటే ఈ వివాదాన్నే ఎక్కువగా హైలెట్ చేసేందుకు తప్పును అంగీకరించకుండా.. భారత్ క్రికెట్లోకి రాజకీయాలను తీసుకువచ్చిందని ఆరోపించారు. పాక్ పత్రిక డాన్ ‘రాజకీయాలు మళ్లీ క్రికెట్లోకి ప్రవేశించాయి. భారత్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించి వివాదాన్ని సృష్టించింది’ అంటూ అడ్డగోలుగా వార్తను రాసింది. జియో న్యూస్ ‘భారత్ కొత్త నాటకం’ అంటూ వార్తను వండి వార్చింది.
‘వివాదాస్పద ఫైనల్లో పాకిస్తాన్‌ను భారత్ ఓడించింది’ అని న్యూస్ ఇంటర్నేషనల్ కథనాన్ని రాసింది. ‘మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించి భారత జట్టు కొత్త వివాదం రేపింది’ అంటూ జియో టీవీ చెప్పుకొచ్చింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై పాక్ మాజీ ప్లేయర్లు, దిగ్గజ ఆటగాళ్లు సొంత జట్టుపైనే విమర్శలు గుప్పించారు. షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ నిరాశగా ఉందని.. కానీ తన జట్టు పరిస్థితి.. భారత జట్టు పరిస్థితి తనకు తెలుసునన్నాడు. తప్పుడు ఎక్కడ ఉన్నాయో మీరే ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది.. చేసిన తప్పులే మళ్లీ పునరావృతమవుతున్నాయని.. వాటిని సరిదిద్దుకోవాలని.. ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాజీ ప్లేయర్ రమీజ్ రాజా సూచించాడు.
పాక్ మిడిలార్డర్ బలహీనంగా ఉందని.. ఓపెనర్లు విఫలమైతే మొత్తం మిడిల్ ఆర్డర్ కూలిపోతుందని.. జట్టు భయపడుతుందని.. వారికి మానసిక సమస్య ఉన్నట్లు అనిపిస్తుందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. బాసిత్ అలీ సైతం ఆటగాళ్ల నైపుణ్యంపై విమర్శలు గుప్పించాడు. ప్లేయర్స్ స్పెషలిస్ట్ క్రికెటర్స్ కాదా.. డబ్బు సంపాదించడం లేదా? మైదానంలో ఎందుకు పని ఆడరు? అంటూ ప్రశ్నించాడు. ఫైనల్లో ఓటమి తర్వాత పాక్ ఆటగాళ్లు, బోర్డు పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన టోర్నీలను గెలవాలనుకుంటే జట్టు మనస్తత్వం, ఆటగాళ్ల ఎంపిక, కోచింగ్ సిబ్బందిలో మార్పులు అవసరమని సూచించారు. మైదానంలో పరాజయాలు, మైదానం వెలుపల వివాదాలు పాకిస్తాన్ క్రికెట్‌ను మరింత చిక్కుల్లో పడేశాయి. భారత జట్టు ట్రోఫీ లేకుండానే తిరిగి వచ్చినా.. మరోసారి ఆసియా కప్‌లో తమ ఆధిపత్యం చూపించారని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.