Asia Cup | ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. యూఏఈని మట్టికరిపించింది. ఈ విజయంలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ తన అద్భుతమైన స్పెల్ 2.1 ఓవర్లలో ఏడు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల పడగొట్టాడు. విశేషం ఏంటంటే.. ఒకే ఓవర్లోనే మూడు వికెట్లు తీసి.. యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మ్యాచ్ తర్వాత, భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసించాడు. అదే సమయంలో టీమిండియా వైఖరిని ప్రశ్నించాడు. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించాడు. ఈ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించిన కుల్దీప్ను రాబోయే పాక్‌తో మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం చేస్తారని చెప్పాడు.
సోనీ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. నెక్ట్స్ మ్యాచ్ ఆడడు. ఎందుకంటే టీమిండియా అతన్ని ఇలాగే చూస్తుంది. బాగా ఆడినప్పుడు అతన్ని జట్టు నుంచి తొలగించారు. ఇప్పుడు నాలుగు వికెట్లు తీసిన తర్వాత రాబోయే మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం లేదు’ అంటూ మంజ్రేకర్ కామెంట్ చేశాడు. అయితే, నేను జోక్ చేస్తున్నాను. కానీ, ఇది కుల్దీప్ యాదవ్ కెరీర్. అప్పుడు జట్టు నుంచి తొలగించినప్పటికీ కొంత మ్యాచ్ చేస్తూనే ఉన్నాడు. అతని గణాంకాలు చూడండి. టెస్ట్, వన్డే, టీ20 అయినా అద్భుతంగా ఉన్నాయి. కానీ, ఇప్పటికీ భారత జట్టులో ‘తప్పనిసరి’ ఆటగాళ్లలో చేర్చబడ్డాడు. అంటే, సులభంగా తొలగించగల ఆటగాళ్ళు’ అని చెప్పుకొచ్చాడు.
కుల్దీప్ యాదవ్ 2017లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు. అయినప్పటికీ, ఇప్పటివరకు 13 టెస్టులు, 41 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వన్డేల్లో అతని బౌలింగ్ సగటు 27 కంటే తక్కువ. టెస్టుల్లో సగటు 22.16, టీ20ల్లో ఇది 13.39 మాత్రమే. అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా జట్టుకు దోహదపడినట్లుగా ఈ గణాంకాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అయితే, జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచలేకపోతుంది. అందుకే బెంచ్‌కే పరిమితం చేస్తుంది.
ఇంగ్లండ్ పర్యటనలో సీనియర్లు కుల్దీప్ను తీసుకోవాలని డిమాండ్ చేసినా.. అతనికి ఆడే అవకాశం లేదు. ప్రస్తుతం ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుతం మంజ్రేకర్ జోక్ అంటూనే సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో స్పిన్ విభాగంలో చాలా కాలంగా విపరీతమైన పోటీ ఉంది. తన కెరీర్లో కుల్దీప్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ వంటి స్పిన్నర్లతో స్థానం కోసం పోటీ పడాల్సి వచ్చింది. దాంతో చాలా రోజుల పాటు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
దుబాయి వేదికగా ఆసియా కప్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. పవర్ ప్లే తర్వాత కుల్దీప్కు బంతి ఇచ్చారు. ఆ తర్వాత కుల్దీప్ మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. తొమ్మిదో ఓవర్లో యూఏఈ 48/2 స్కోర్ నుంచి ఒక్కసారిగా 50/5కి చేరింది. అనంతరం యూఏఈ దారుణంగా కేవలం 57 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇది ఆసియా కప్ టీ20 చరిత్రలో యుఏఈ అత్యల్ప స్కోరు. టోర్నీ మొత్తంలో రెండో అత్యల్ప స్కోర్. ఆ తర్వాత బ్యాంటింగ్‌కు వచ్చిన టీమిండియా 4.3 ఓవర్లలోనే గెలిచింది. బంతుల పరంగా టీమిండియాకే ఇదే అతిపెద్ద విజయం. అద్భుతంగా బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.