Ind Vs Pak | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చారు. భారత జట్టు బ్యాటింగ్‌లో బలంగా ఉందన్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పటివరకు భారీగా పరుగులు చేసినా.. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఫైనల్లో ప్రభావం చూపగలరని గవాస్కర్ పేర్కొన్నారు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. సూర్యకుమార్ యాదవ్ ఇంకా భారీ స్కోర్ చేయాలని ఉందని.. తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా సైతం పరుగులు సాధించగలరని.. శుభ్‌మన్ గిల్ బాగా బ్యాటింగ్ చేశాడని.. అతని నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాటింగ్ బలంగా ఉందని.. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మను ప్రత్యేకంగా గవాస్కర్ ప్రశంసించాడు.
ఫైనల్లో సెంచరీ సాధించడానికి ప్రయత్నిస్తానని చెప్పాడని.. అభిషేక్ ఆ అవకాశాన్ని జారవిడుకోడని.. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని.. టోర్నీలో ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలు సాధించాడని గుర్తు చేశాడు. గత మ్యాచ్‌లో రనౌట్ కావడంతో సెంచరీని మిస్సయ్యాడని.. ఫైనల్లో భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తాడన్నారు. బహుశా సెంచరీ చేస్తాడని భావిస్తున్నట్లు గవాస్కర్ తెలిపారు. సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్‌పై 74, బంగ్లాదేశ్‌పై 75, శ్రీలంకపై 61 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత్-పాక్ మధ్య ఫైనల్లో భారత జట్టు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో వైవిధ్యం కనిపిస్తుందని.. ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్‌తో జాగ్రత్తగా ఉండాలని పాకిస్తాన్‌కు గవాస్కర్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. భారత బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ కూడా ఫైనల్‌కు ముందు సంతోషం వ్యక్తం చేశాడు. మరోసారి అభిషేక్ శర్మ, పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది మధ్య జరిగే పోరాటాన్ని అభిమానులు చూస్తారని మోర్కెల్ పేర్కొన్నాడు.