ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ వైరం సాధారణ వైరం కాదు. ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్ జరిగితే.. అది టెస్టయినా, వన్డే అయినా, టీ20 అయినా సరే వ్యూయర్షిప్ రికార్డులు బద్దలైపోతాయి. ఈ విషయం గత టీ20 ప్రపంచకప్‌లోనే కాదు, తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో కూడా స్పష్టమైంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే జరగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.
అయితే ఆ తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు తలపడేది వచ్చే ఆసియా కప్‌లోనే. ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో ఈ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేకపోయింది. దీంతో మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో మాత్రమే దాయాదుల పోరు చూడగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఆసియా కప్‌లో ఇది కూడా జరగదేమోనని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే 2023లో జరిగే 50 ఓవర్ల ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరుగుతుంది. మరి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో.. పాక్‌కు భారత జట్టు వెళ్తుందా? అనేది ప్రశ్నార్థకమే. అయితే టీమిండియాను దాయాది దేశం పంపేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియషన్లకు బీసీసీఐ నుంచి లేఖలు అందాయట.
ఈ నెల 18న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ.. భారత ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తెలుస్తోంది. ప్రభుత్వం నో చెప్తే భారత జట్టు వచ్చే ఆసియా కప్ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత జట్టు చివరగా రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో 2005-06లో పాకిస్తాన్లో పర్యటించింది. ఆ తర్వాత మళ్లీ పాక్ గడ్డపై టీమిండియా అడుగు పెట్టలేదు.