Ashwin : ప్రపంచ క్రికెట్లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఓ మేటి బౌలర్. ఈ స్పిన్ మాంత్రికుడు ఈ మధ్యే టెస్టు(Test Cricket)ల్లో ఐదొందల వికెట్లతో చరిత్ర సృష్టించాడు. వందో టెస్టు ఆడిన 14వ భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గత కొంతకాలంగా టీమిండియా స్టార్ స్పిన్నర్‌గా వెలుగొందుతున్న అశ్విన్ తాజాగా తన కెరీర్లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
అందరిలానే తన జీవితంలోనూ చీకటి రోజులు ఉన్నాయని యష్ తెలిపాడు. మానసిక ఆరోగ్యం బాగాలేక నానా ఇబ్బందులు పడ్డానని, ఓ దశలో క్రికెట్ వదిలేద్దానుకున్నానని అశ్విన్ అన్నాడు. ‘క్రికెటర్‌గా ఎదుగుతున్న కమ్రంలో నేను గడ్డు రోజుల్ని చవిచూశా. 2017లో మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డాను.
ఆ సమయంలో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని ఒంటరిగా ఏడ్చేవాడిని. ఒకానొక దశలో క్రికెట్ వదిలేసి ఎంబీఏ చదవాలనుకున్నా. అయితే.. మానసిక ఆరోగ్య నిపుణులను కలిసి ఎలాగోలా బయటపడ్డాను. అక్కడితో నా జీవితం మారిపోయింది’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
వందో టెస్టు క్యాప్ అందుకున్న అశ్విన్
టీమిండియా స్పిన్ అస్త్రంగా పేరొందిన అశ్విన్ ఇంగ్లండ్ సిరీస్‌లో ఐదొందల వికెట్ల క్లబ్లో చేరాడు. ఓపెనర్ జాక్ క్రాలే (Jack Crawley) ను ఔట్ చేసిన అశ్విన్.. 500వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, అంతర్జాతీయంగా ఈ ఫీట్ సాధించిన తొమ్మిదో బౌలర్‌గా యష్ రికార్డు సృష్టించాడు. దాంతో, అతడిని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(TNCA) ఘనంగా సన్మానించింది. టెస్టుల్లో అరుదైన మైలురాయికి గుర్తుగా.. 500 బంగారు నాణాలతో టీఎన్‌సీఏ ఈ స్పిన్ మాంత్రికుడిని సత్కరించింది. అంతేకాదు వంద టెస్టులు ఆడినందుకు అతడికి రూ.1 కోటి క్యాష్‌ను బహుమతిగా అందించింది.