హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ గెలుపు బాట పట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 28-26తో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రథమార్ధంలో వెనుకంజ వేసిన టైటాన్స్..కీలకమైన ద్వితీయార్ధంలో జూలు విదిల్చింది. టైటాన్స్ తరపున ఆశీష్ నర్వాల్(9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5 పాయింట్లు), డిఫెండర్ అంకిత్(4 పాయింట్లు) రాణించారు.
పట్నా జట్టులో దేవాంక్(7 పాయింట్లు), అయాన్(6 పాయింట్లు) ఆకట్టుకున్నారు. ఇరు జట్ల మధ్య ప్రథమార్ధం హోరాహోరీగా సాగింది. పవన్ ఒకింత తడబడ్డా..ద్వితీయార్ధంలో ఆశీష్ కూడా జత కలువడంతో టైటాన్స్‌కు తిరుగులేకుండా పోయింది. పుంజుకునేందుకు పైరేట్స్ ప్రయత్నించినా..వరుస పాయింట్లతో టైటాన్స్ విజయం వైపు నిలిచింది.