లాస్ వేగాస్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ కొత్త చరిత్ర లిఖించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్లో అర్జున్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఈ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో అర్జున్ 1.5-0.5తో నొదిర్బెక్ అబుసత్రోవ్ (ఉజ్బెకిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ ప్రపంచ నంబర్ 5 ర్యాంకర్.. ఉజ్బెక్ ప్లేయర్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. నొదిర్‌బెక్‌తో తొలి ర్యాపిడ్ గెలిచిన అర్జున్.. మలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేస్తూ తొలి గేమ్‌ను అలవోకగా కైవసం చేసుకున్న ఈ తెలంగాణ యువ ప్లేయర్.. రెండో గేమ్ డ్రా చేసుకోవడం ద్వారా నొదిర్బెక్కు 0.5 పాయింట్ దక్కింది. శనివారం జరిగే సెమీస్‌లో లెవాన్ అరోనియన్‌తో అర్జున్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మిగతా క్వార్టర్స్‌లో అరోనియన్ 2.5-1.5తో హికారు నకామురపై గెలువగా, హన్స్ మోక్ నీమన్ 4-2తో జవోకిర్ సిద్రోవ్(ఉజ్బెకిస్థాన్)పై గెలిచి ముందంజ వేశారు. ఇదిలా ఉంటే ఫ్రీ స్టయిల్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అర్జున్ సత్తాచాటిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నది. తన కంటే మెరుగైన ర్యాంక్ ప్లేయర్లను చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్న తీరు అద్భుతం. ఈ టోర్నీలో విజయాల ద్వారా ఫీడే రేటింగ్స్‌లో అర్జున్ 2800 మార్క్‌ను అధిగమించే అవకాశముంది.
ఓవైపు అర్జున్ విజయంతో భారత చెస్ అభిమానులు సంబరపడుతుంటే..మరోవైపు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నిష్ర్కమణ నిరాశ కల్గించింది. ప్రపంచ మాజీ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై అద్భుత విజయంతో జోరు మీద కనిపించిన ప్రజ్ఞానంద 3-4 తేడాతో అమెరికా జీఎం ఫాబియానో కరువానతో పోరాడి ఓడాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో అర్మగెడాన్ పద్ధతిలో ప్రజ్ఞానంద ఓటమి వైపు నిలిచాడు. మొత్తం ఏడు గేముల్లో తొలి గేమ్ గెలిచిన ఈ చెన్నై చిన్నోడు..వరుసగా నాలుగు గేమ్‌లు చేజార్చుకున్నాడు. ఆ తర్వాత ప్రజ్ఞానంద పుంజుకున్న లాభం లేకపోయింది. ఈ ఓటమితో లోయర్ బ్రాకెట్లో ఏడుగురు ప్లేయర్లతో కలిసి ప్రజ్ఞానంద నాకౌట్ గేముల్లో తలపడనున్నాడు. ఇదిలా ఉంటే లోయర్ బ్రాకెట్లో మాగ్నస్ కార్ల్సన్ 2-0తో విదిత్ గుజరాతిపై గెలిచాడు.