హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రతిభ ఉన్నా.. సరైన అవకాశాలు లేక, గుర్తింపునకు నోచుకోక ఎంతో మంది జిల్లా క్రికెటర్లు మరుగునపడిపోతున్నారు. హైదరాబాద్ నగరంలోని క్లబ్ క్రికెటర్లతో పోలిస్తే జిల్లాల ఆటగాళ్లకు మ్యాచ్‌లు ఆడే అవకాశాలు, సౌకర్యాలు చాలా తక్కువ. వారు ఇంటర్ డిస్ట్రిక్ట్ లాంటి కొన్ని టోర్నమెంట్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హెచ్‌సీఏ తీసుకొచ్చిన ‘టీజీ 20 లీగ్’ ఇప్పుడు గ్రామీణ ప్రతిభావంతులకు ఆశాకిరణంగా మారింది. ఇటీవల జరిగిన లీగ్ తొలి సీజన్ ఆటగాళ్ల వేలంలో జిల్లాల క్రికెటర్లు భారీ ధర పలుకుతూ తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున ఆడుతున్న సిద్దిపేట టౌన్‌కు చెందిన అన్నదమ్ములు మహ్మద్ అఫ్రిది అహ్మద్, అర్ఫాజ్ అహ్మద్ వేలంలో దుమ్మురేపారు. ఐపీఎల్, రంజీ ట్రోఫీలు ఆడిన పలువురు స్టార్ క్రికెటర్లను తోసిరాజని 24 ఏండ్ల అర్ఫాజ్ ఏకంగా 11 లక్షల రూపాయలు పలికి ఔరా అనిపించాడు. అతడి అన్న 26 ఏండ్ల అఫ్రిది రూ. 2.30 లక్షలు కైవసం చేసుకున్నాడు. అత్యంత పేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరి క్రికెట్ ప్రయాణం గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకం.
సిద్దిపేట పాత బస్టాండ సమీపంలో నివసించే అర్ఫాజ్, అఫ్రిది ఇద్దరూ బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలింగ్‌లోనూ రాణించే అద్భుతమైన ఆల్‌రౌండర్లు. వీరి తండ్రి అమీర్ జానీ ఒకప్పుడు మంచి ఫాస్ట్ బౌలర్. కానీ, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతల వల్ల ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. తాను సాధించలేకపోయిన కలను తన కుమారుల రూపంలో నెరవేర్చుకోవాలని భావించిన జానీ స్వయంగా కోచ్‌గా మారి ఇద్దరినీ తీర్చిదిద్దుతున్నాడు.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రికెట్ గ్రౌండే ఈ ముగ్గురి అడ్డా. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు మైదానంలో కఠోరంగా శ్రమిస్తారు. వర్షం వల్ల మైదానంలోకి వెళ్లలేని పరిస్థితి ఉంటే తప్ప.. ఏఒక్క రోజూ వీరు ప్రాక్టీస్ తప్పింది లేదు. అయితే, క్రికెట్ కిట్లు కొనేందుకు, కుటుంబ జీవనాధారం కోసం మధ్యాహ్నం వేళల్లో ఈ అన్నాదమ్ములు తమ టెంట్ హౌజ్ పనులకు వెళ్తారు. బరువైన ఇనుప పైపులు మోస్తూ, షామియానాలు కడుతూనే.. చేతులకు ఉన్న నొప్పులను సైతం లెక్కచేయకుండా మైదానంలో ఈ అన్నాదమ్ములు బంతిని, బ్యాట్‌ను ఝుళిపిస్తున్నారు. పేదరికం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏమాత్రం తగ్గలేదు. ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరినప్పటికీ.. పూర్తి ఫోకస్ ఆటపైనే పెట్టడంతో చదువును కూడా పూర్తి చేయలేకపోయారు.
సాధారణంగా హైదరాబాద్ నగరంలోని క్రికెట్ క్లబ్‌లలో ఆడే ఆటగాళ్లకు లభించే అవకాశాలు, మౌలిక వసతులు జిల్లాల క్రికెటర్లకు లభించవు. మ్యాచ్‌లు ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ హెచ్‌సీఏ ఇటీవల నిర్వహించిన ఎ-డివిజన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీమ్ తరఫున ఆడిన అఫ్రిది, అర్ఫాజ్ జట్టు తరఫున టాప్ స్కోరర్లుగా నిలిచారు. బౌలింగ్‌లో అర్ఫాజ్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అర్ఫాజ్ అహ్మద్‌ను ఏకంగా రూ. 11 లక్షల భారీధరకు నల్లగొండ నైట్స్ జట్టు కొనుగోలు చేయగా, అఫ్రిది అహ్మద్‌ను రూ. 2.30 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఉమ్మడి మెదక్‌కు చెందిన మరో క్రికెటర్ అఖిల్ రాథోడ్ రూ. 1.6 లక్షలకు హైదరాబాద్ ఈ-చాంపియన్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
హెచ్‌సీఏలో హైదరాబాద్, రంగారెడ్డి తప్ప మిగిలిన 8 ఉమ్మడి జిల్లాల క్రికెటర్లకు సరైన అవకాశాలు రావడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో టీజీ 20 లీగ్‌లో ప్రతీ ఫ్రాంచైజీ కనీస నలుగురు జిల్లా క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఇక్కడి ప్రతిభావంతులకు సువర్ణావకాశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం నుంచి ఏడుగురు, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల నుంచి ఆరుగురు చొప్పున వివిధ జట్లకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్‌లో ప్రతీ ఫ్రాంచైజీ తమ తుది జట్టులో ఇద్దరు జిల్లాల క్రికెటర్లను ఆడించాంటుంది. ఈ నిబంధన వల్ల మరింత మంది గ్రామీణ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మా నాన్న క్రికెటర్ కావడంతో మా ఇద్దరికీ తెలియకుండానే ఆటపై ఆసక్తి పెరిగింది. ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాటు, బంతులే మా నేస్తాలు. మా నాన్నే గురువు. హెచ్ సీఏ నిర్వహించే ఏ టోర్నీకి వెళ్లినా బాగా ఆడుతున్నాం. ఆట, అవకాశాల పరంగా ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాజేందర్ రెడ్డి కొంత సాయం చేశారు. జిల్లాలకు చెందిన క్రికెటర్లు చాలా మంది హైదరాబాద్ వెళ్లి అకాడమీల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ, అక్కడికి వెళ్లి అంత ఖర్చు చేసే స్థోమత మాకు లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. టీజీ20 లీగ్‌ను మేం సద్వినియోగం చేసుకుంటాం. నాణ్యమైన కోచింగ్, సదుపాయాలు లభిస్తే కచ్చితంగా ఐపీఎల్‌కు, ఆ తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – అర్ఫాజ్, అఫ్రిది
వేలంలో అర్ఫాజ్, అఫ్రిదినే కాకుండా వివిధ జిల్లాలకు చెందిన ప్రతిభావంతులు మంచి రేటు పలుకుతూ జిల్లాల సత్తాను చాటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రంజీ ఆటగాడు అమన్‌రావును రూ. 12 లక్షల గరిష్ఠ ధరకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకోగా, ఐపీఎల్‌కు ఎంపికైన అవనీష్ రావు రూ. 7 లక్షలకు రంగారెడ్డి రైజర్స్ జట్టులో చేరాడు. గతంలో ఆదిలాబాద్ జిల్లాకు ఆడిన కె. హిమతేజ (రూ. 8 లక్షలు)తో పాటు జి. సాయికృష్ణ రెడ్డి (రూ. 1.8 లక్షలు) ఖమ్మం ఏసెస్ టీమ్‌కు ఎంపికయ్యాడు. నిజామాబాద్ జిల్లా క్రికెటర్ నితీశ్ రెడ్డి (రూ. 5.5 లక్షలతో నల్లగొండ నైట్స్), నల్లగొండ జిల్లాకు చెందిన జ్ఞాన ప్రకాశ్ రెడ్డి (రూ. 4 లక్షలతో రంగారెడ్డి రైజర్స్), మహబూబ్‌నగర్ క్రికెటర్ జి. గణేశ్ (రూ. 3.25 లక్షలతో హైదరాబాద్ ఈ-చాంపియన్స్) కూడా వేలంలో మెరిశారు.