Jyothi Surekha | షాంఘై: ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌లో తెలుగు యువ ఆర్చర్ వెన్నెం జ్యోతిసురేఖ స్వర్ణ ధమాకాతో అదరగొట్టింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మూడు పసిడి పతకాలతో మెరిసింది. శనివారం జరిగిన వేర్వేరు కాంపౌండ్ విభాగాల్లో భారత ఆర్చర్లు ఐదు పతకాలు కొల్లగొట్టారు.
ప్రస్తుతం ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్న సురేఖ మరోమారు సత్తాచాటుతూ పసిడి పతకాలు కొల్లగొట్టింది. శనివారం హోరాహోరీగా సాగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత పోరులో సురేఖ 146-146(9-9) స్కోరుతో అండ్రియా బెస్సెర్రా(మెక్సికో)పై అద్భుత విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో స్కోర్లు సమం కాగా షూటౌట్లో సురేఖ విజేతగా నిలిచింది.
అదే జోరు కొనసాగిస్తూ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో సురేఖ, అభిషేక్‌వర్మ జోడీ 158-157తో లిసెల్లీ, రాబిన్(ఈస్తోనియా)పై గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ తుది పోరులో జ్యోతిసురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్‌కౌర్ త్రయం 236-235తో మార్సెలా టినోలి, ఇరెన్ ఫ్రాచిని, ఎలీసా రోనర్(ఇటలీ)పై పసడి కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో అభిషేక్, ప్రియాంశ్, పార్తమేశ్ త్రయం 238-231తో మైక్ స్కాల్సర్, సిల్ పాటర్, స్టెఫ్ విలియమ్స్‌పై స్వర్ణం సొంతం చేసుకుంది.