Smith – Archer : యాషెస్ సిరీస్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా రెండో విజయంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గబ్బాలో జరిగిన పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆసీస్.. స్వదేశంలో తిరుగులేదని చాటుకుంది. ఇంగ్లండ్, కంగారూ ఆటగాళ్ల కవ్వింపులు.. వాగ్వాదాలు లేకుండా చప్పగా సాగుతున్న యాషెస్‌లో నాలుగో రోజు ఆసక్తికర సంఘటన జరిగింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steven Smith), పర్యాటక జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) మాటల యుద్ధానికి దిగారు.
గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 241కే ఆలౌట్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం 65 పరుగుల ఛేదనలో ట్రావిస్ హెడ్ (22), మార్నస్ లబూషేన్ త్వరగానే ఔటయ్యారు. నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(23 నాటౌట్) దూకుడుగా ఆడాడు. మరోవైపు అతడిని పెవిలియన్ పంపేందుకు ఆర్చర్ తీవ్రంగా ప్రయత్నించాడు. షార్ట్ పిచ్ బంతులు సంధించిన ఇంగ్లండ్ పేసర్.. చివరకు నోటికి పనిచెప్పాడు. అయితే.. ఆసీస్ సారథి కూడా ఏమాత్రం తగ్గలేదు.
“Bowl fast when there’s nothing going on champion.”
Steve Smith v Jofra Archer was seriously spicy 🍿 #Ashes pic.twitter.com/jfa4PiZyb2
— cricket.com.au (@cricketcomau) December 7, 2025
స్మిత్‌ను ఔట్ చేసేందుకు ఆర్చర్ షార్ట్ పిచ్ బంతులు విసిరాడు. కానీ, స్మిత్ ఏమాత్రం తడబడలేదు. ఫుల్‌షాట్‌తో బౌండరీ సాధించిన అతడు.. ఆ తర్వాత బంతిని అప్పర్కట్ ఆడబోయి మిస్ అయ్యాడు.. అప్పుడు ఆర్చర్ స్మిత్‌ను ఉద్దేశించి నోరుజారాడు. ఇంగ్లండ్ పేసర్ తీరుతో చిర్రెత్తుకొచ్చిన స్మిత్ ఏదీ కలిసిరానప్పుడు వేగంగా బౌలింగ్ చేయొచ్చుగా ఛాంపియన్ అని ఆర్చర్‌కు కౌంటర్ ఇచ్చాడు.
అంతేకాదు ఆ తర్వాత రెండు బంతులకు 10 రన్స్ సాధించాడు. మ్యాచ్ పూర్తయ్యా ఆర్చర్‌తో వివాదంపై ప్రశ్నించగా.. అదంతా మైదానంలోనే ముగిసింది. అతడు ఛాంపియన్ బౌలర్ అని జవాబిచ్చాడు స్మిత్. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య డిసెంబర్ 17న అడిలైడ్‌లో మూడో టెస్టు జరుగనుంది.