Team India | భారత జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. టైటిల్ స్పాన్సర్ హక్కులను అపోలో టైర్స్ కంపెనీ దక్కించుకున్నది. ఈ మేరకు బీసీసీఐతో అపోలో టైర్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అపోలో టైర్స్ బీసీసీఐకి ఒక్కో మ్యాచ్‌కు రూ.4.5కోట్లు చెల్లించనున్నట్లు బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ అపోలో టైర్స్‌తో ఒప్పందం కుదిరిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అపోలో టైర్స్ 2027 వరకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం.. అపోలో టైర్స్ బీసీసీఐకి ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లు చెల్లిస్తుందని పలు మీడియా నివేదికలు తెలిపాయి. గతంలో స్పాన్సర్‌గా వ్యవహరించిన డ్రీమ్ లెవెన్ ఒక్కో మ్యాచ్‌కు రూ.4కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. అపోలో టైర్స్ కాకుండా కాన్వా, జేకే టైర్స్ సైతం బిడ్స్ వేసినట్లు నివేదిక తెలిపింది. దాంతో పాటు బిర్లా ఆప్టస్ పెయింట్స్ ఆసక్తి చూపించినా బిడ్డింగ్‌లో ప్రక్రియలో పాల్గొనేందుకు మాత్రం ఇష్టపడలేదు.
స్పాన్సర్‌గా డ్రీమ్ 11 వైదొలిగిన తర్వాత బీసీసీఐ భారత జట్టు స్పాన్సర్ హక్కుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిందిన విషయం తెలిసిందే. బిడ్డింగ్ ప్రక్రియ మంగళవారం జరిగింది. గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, పొగాకు బ్రాండ్లను బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో భారత జట్టు జెర్సీపై అపోలో టైర్స్ పేరు కనిపించనున్నది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత జట్టు జెర్సీపై స్పాన్సర్ లేకుండానే ఆడుతున్న విషయం తెలిసిందే. అలాగే, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ భారత జట్టు జెర్సీ లేకుండానే ఆడుతున్నది. కొత్త స్పాన్సర్ దొరికిన నేపథ్యంలో రాబోయే మ్యాచ్‌లలో మహిళల జట్టు జెర్సీపై అపోలో టైర్స్ పేరు కనిపిస్తుందా? లేదా ? చూడాల్సిందే. రాబోయే ప్రపంచకప్ నుంచి జెర్సీ పేరు ఉంటుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు. మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.