ఢిల్లీ: టీమ్ఇండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చింది. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో మూడేండ్ల ఒప్పందాన్ని మధ్యలోనే వదిలేసుకున్న ‘డ్రీమ్ 11’ స్థానాన్ని తాజాగా ప్రముఖ టైర్ల కంపెనీ ‘అపోలో టైర్స్’ భర్తీ చేయనుంది. రెండున్నరేండ్ల కాలానికి గాను అపోలో.. రూ. 579 కోట్లకు బిడ్ వేసి టీమ్ఇండియా జెర్సీ స్పాన్సర్షిప్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా అపోలోతో తాజా డీల్.. గత డ్రీమ్ 11 ఒప్పందం (రూ. 358 కోట్లు)తో పోల్చితే రూ. 213 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ఒప్పందం రెండున్నరేండ్ల పాటు (2028 మార్చి) వరకు కొనసాగనుంది. ఇకనుంచి భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఆడే మూడు ఫార్మాట్ల మ్యాచ్‌లలో క్రికెటర్ల జెర్సీలపై ‘అపోలో టైర్స్’ పేరు ఉండనుంది. రెండున్నరేండ్లలో ఆ సంస్థ భారత జట్టు ఆడే 121 ద్వైపాక్షిక, 21 ఐసీసీ మ్యాచ్‌లకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. స్వదేశంలో అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి అపోలో.. టీమ్ఇండియాతో ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
డ్రీమ్ 11 నిష్క్రమణతో ఈనెల 2న బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా బిడ్డింగ్‌లో అపోలో.. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాన్వా (రూ. 544 కోట్లు), జేకే సిమెంట్స్ (రూ. 477 కోట్లు)తో తీవ్ర పోటీనెదుర్కున్నా చివరికి వారికంటే ఎక్కువ చెల్లించి స్పాన్సర్షిప్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం టీమ్ఇండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు అపోలో రూ. 4.77 కోట్లు (డ్రీమ్ 11 రూ. 4 కోట్లు చెల్లించేది) బీసీసీఐకి చెల్లించనుంది. టెండర్ల ప్రక్రియ సందర్భంగా బీసీసీఐ ఒక్కో మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు (ద్వైపాక్షిక), రూ. 1.5 కోట్లు (ఐసీసీ) కనీస ధరను నిర్ణయించగా అంతకంటే ఎక్కువగానే ఆదాయాన్ని ఆర్జించనుండటం గమనార్హం.