హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖల పేరుతో నకిలీ సిఫారసు లేఖల ద్వారా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)నుంచి ఐపీఎల్ టికెట్లు పొంది వాటిని అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాలోని ముగ్గురు సభ్యులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని ఏపీకి చెందిన టీడీపీ నాయకుడిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి సీపీ బి.సుమతి వెల్లడించారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్న ప్రకారం జిల్లా పాలకూరు గ్రామానికి చెందిన గట్టమనేని అశోక్ కాకినాడలో టీడీపీ పార్టీకి చెందిన జెండాలను తయారు చేస్తుంటాడు.
తన స్నేహితులు కనకాల దినేష్, సింగమనేని వేణుమాదవ్, తమిళనాడుకు చెందిన అశీష్, సింథాల్, థన్షీల్తో ఒక బృందంగా ఏర్పడి న్యాయమూర్తులు, మంత్రులు, గవర్నర్లకు సంబంధించిన నకిలీ సిఫారసు లేఖలు తయారు చేశాడు. వాటి ద్వారా హెచ్‌సీఏతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాసులను తీసుకుంటున్నాడు. ఇలా ఐదు మ్యాచ్‌లకు 29 టికెట్లను సేకరించిన ముఠా రూ. 50 వేల వరకు బ్లాక్‌లో విక్రయించింది. పక్కా సమాచారంతో ఎస్ఓటీ డీసీపీ మనోహర్ నేతృత్వంలోని బృందం ఉప్పల్ స్టేడియం వద్ద నిఘా పెట్టి అశోక్‌తో పాటు దినేశ్, వేణుమాదవ్‌ను అదుపులోకి తీసుకుంది. నిందితుల వద్ద ఒక్కోటి రూ. 22 వేల విలువైన ఐదు టికెట్లు వద్ద లభించాయి. విచారణలో వాటిని హెచ్‌సీఏ నుంచి తీసుకున్నామని నిందితులు తెలిపారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరికి తమిళనాడులో సహకరిస్తున్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
ప్రతీ ఐపీఎల్ మ్యాచ్‌కు హెచ్‌సీఏ సభ్యులతో పాటు కొందరు ప్రముఖులకు ఉచిత కంప్ల్లిమెంటరీ పాసులు ఇస్తారు. ఇలాంటి పాసుల కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సిఫారసు లేఖలు పంపిస్తుంటారు. అయితే, హెచ్‌సీఏ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తాము ఇవ్వాలనుకున్న వారికి మాత్రమే పాసులను కేటాయిస్తుంటారు. అలాంటిది నకిలీ సిఫారసు ప్రతాలు ఇచ్చిన వారికి అంత సులువుగా పాసులను కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. తాజా ఉదంతం తర్వాత ఇలాంటి ముఠాల ద్వారా హెచ్‌సీఏ సభ్యులే ఉచిత పాసులను బ్లాక్లోవిక్రయిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు నకిలీ సిఫారసు లేఖలపైనే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్‌సీఏ నుంచి పాసులు బ్లాక్ మార్కెట్‌కు వెళ్తున్న ఆరోపణలపైనా లోతైన దర్యాప్తు జరపాలని క్రీడా ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.