షెన్జెన్ (చైనా): భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ.. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో సంచలన విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో 19 ఏండ్ల అనుపమ.. 21-17, 8-21, 22-20తో ప్రపంచ 15వ ర్యాంకర్ బీవెన్ జెంగ్ (అమెరికా)ను ఓడించింది. 48 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించి మొదటి గేమ్‌లో 11-3 ఆధిక్యం సాధించింది. తర్వాత జెంగ్ కోలుకున్నా అప్పటికే ఆధిక్యంలో ఉన్న అనుపమ ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది. కానీ రెండో గేమ్‌లో జెంగ్ పుంజుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్ ఒకదశలో ఇరువురు 20-20తో సమంగా నిలిచినప్పటికీ జెంగ్ చేసిన తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న భారత షట్లర్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో భార్యాభర్తల జంట సుమిత్‌రెడ్డి-సిక్కిరెడ్డి 23-21, 17-21, 21-17తో ప్రెస్లీ స్మిత్, జెన్నీ (అమెరికా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు.