Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ పదో రోజు భారత్ రెండో కాంస్యాన్ని కోల్పోయింది. స్కీట్ మిక్స్డ్ టీమ్ విభాగంలో మహేశ్వరి చౌహన్(Maheshwari Chauhan), అనంత్ జీత్ సింగ్ నరుక(Anant Jeet Singh Naruka) జోడీ ఒక్క పాయింట్‌తో పతకం చేజార్చుకుంది. క్వాలిఫయింగ్ రౌండ్లో 146 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచిన మహేశ్వరి, అంకిత్ జోడీ కాంస్య పోరులోనూ రాణించింది.
కానీ, చివరకు చైనా జంట జియంగ్ ఇతింగ్, లియూ జియన్లి 44 – 43తో కంచు మోత మోగించింది. . మహేశ్వరి, అనంత్ ద్వయం విజయానికి దగ్గరగా వచ్చినా ఒకే ఒక పాయింట్ అంతరంతో పతకాన్ని అందుకోలేకపోయింది.
మరోవైపు యువ షట్లర్ లక్ష్య సేన్(Lakshya Sen) సైతం చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయాడు. విశ్వ క్రీడల్లో తొలి కాంస్యం గెలుస్తాడనుకుంటే గాయం కారణంగా ఊహించని రీతిలో ఓడాడు. కాంస్య పతక పోరులో మలేషియా షట్లర్ లీ జిల్ జియా(Lee Zil Jia) చేతిలో 21-13, 16-21, 11-21తో పరాజయం పాలై కోట్లాదిమందిని నిరాశపరుస్తూ భారమైన గుండెతో కోర్టును వీడాడు.
ఇక రెజ్లింగ్ పోటీల్లో నిషా దహియా(Nish Dahiya) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 68 కిలోల విభాగంలో టెటియన రిజ్కో(ఉక్రెయిన్)ను 6-4తో ఓడించిన ఈ యువకెరటం పతకం వేటలో అడుగుముందుకు వేసింది.