ముంబై: మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది. ఓ వైపు మహిళల జట్లు టీ20 ప్రపంచకప్ ఆడుతుండగా.. మరోవైపు ఐదు (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్, యూపీ) ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం పోటీ పడనున్నాయి. భారత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, షఫాలీ వర్మ కోసం కోట్లు వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మన అమ్మాయిలతో పాటు అంతర్జాతీయ స్టార్లు అలీసా హీలీ, బెత్ మూనీ, ఎలీసా పెర్రీ, స్కీవర్, మేఘన్ షుట్, డాటిన్ వంటి వాళ్లు భారీ ధర పలికే చాన్స్ ఉంది. ఒక్కో జట్టులో గరిష్టంగా 18 మందిని ఎంచుకునే అవకాశం ఉండగా.. అందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. ప్లేయర్ల కోసం ఒక్కో జట్టు రూ.12 కోట్లు ఖర్చు పెట్టనుంది.