బెంగళూరు: ఐటీఎఫ్ మహిళల ఓపెన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ అంకితా రైనా, రుతుజా భోంస్లే సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో నాలుగో సీడ్ అంకిత 6-1, 6-7(7), 7-5తో డియా హెర్జెలీస్(బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన అంకిత తొలి సెట్‌ను అలవోకగా కైవసం చేసుకుంది. అయితే ప్రత్యర్థి పుంజుకుని పోటీలోకి రావడంతో రెండో సెట్ చేజార్చుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్లో పోరాటపటిమ కనబరిచిన రైనా మ్యాచ్‌ను వశం చేసుకుంది. మరో క్వార్టర్స్‌లో రుతుజా భోంస్లే 3-6, 7-6(5), 6-4తో బ్రిటెన్ ఈడెన్ సిల్వాపై గెలిచి ముందంజ వేసింది. శనివారం అంకితా రైనా, రుతుజ మధ్య సెమీస్ పోరు జరుగనుంది.