హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) నూతన చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తనను సాట్స్ చైర్మన్గా నియమించినందుకు సీఎం కేసీఆర్కు ఆంజనేయగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయిన ఆంజనేయగౌడ్కు గతంలో బీసీ కమిషన్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవముంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గౌడ్ న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకునిగా కీలకంగా పనిచేశారు. ఆంజనేయగౌడ్ పనితీరు మెచ్చిన సీఎం కేసీఆర్..తొలిసారి ఏర్పా టు చేసిన బీసీ కమిషన్లో సభ్యుడిగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం సాట్స్ చైర్మన్గా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తన వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు
ఆలూరులో ఆనందం
గట్టు: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈడిగ ఆంజనేయగౌడ్ నియమితులు కావడంతో జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో ఆనందం వ్యక్తమవుతున్నది. ఆంజనేయగౌడ్ది మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు నర్సమ్మ, చంద్రన్నగౌడ్. నలుగురు అన్నదమ్ముల్లో ఆంజనేయగౌడ్ మూడో వాడు. ఉన్నత చదువులు చదివిన ఆంజనేయగౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించింది. ఆయన సేవలను మరింత వినియోగించుకునేందుకు ప్రభుత్వం సాట్స్ చైర్మన్గా నియమించింది.