కింగ్స్టన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్, ఆ జట్టు గెలిచిన రెండు టీ20 ప్రపంచకప్‌లలో సభ్యుడైన ఆండ్రీ రస్సెల్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఈనెల 22 నుంచి జరుగబోయే ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌కు ఎంపికైన రస్సెల్.. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడతానని, రెండో మ్యాచ్ తర్వాత వీడ్కోలు పలుకుతానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
టీ20 స్పెషలిస్ట్ అయిన రస్సెల్.. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న పొట్టి ప్రపంచకప్‌నకు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. కొద్దిరోజుల క్రితమే విండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ సైతం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పగా తాజాగా ఆ జాబితాలో రస్సెల్ కూడా చేరాడు. 37 ఏండ్ల ఈ జమైకన్ ఆల్‌రౌండర్.. 2012, 2016లో ఆ జట్టు గెలిచిన ప్రపంచకప్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. తన కెరీర్లో వెస్టిండీస్ తరఫున 84 టీ20లు, 56 వన్డేలు, ఒక టెస్టు ఆడిన అతడు.. పొట్టి ఫార్మాట్లో 1,078 పరుగులు చేసి 61 వికెట్లు పడగొట్టాడు.