CM Cup | జూబ్లీహిల్స్, జనవరి1 : తెలంగాణ సీఎం కప్ కరాటే పోటీలలో ఆంధ్రా ఆధిపత్యం నడుస్తున్నది. తెలంగాణ క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేసే సీఎం కప్ క్రీడలు ఆంధ్ర లాబీయింగ్‌తో పక్కదారి పడుతున్నాయి. ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడి తెలంగాణ క్రీడాకారులను బయటకు పంపిన సంఘటన యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో బుధవారం చోటు చేసుకుంది. గతనెల 31న మొదలైన సీఎం కప్ కరాటే పోటీలలో గ్రామీణ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేశారని ప్లేయర్లు, కోచ్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరాటే పోటీల అండర్ 14-15 కుముటీ విభాగంలో జగిత్యాలకు చెందిన శివ అనే ప్లేయర్ ముందుగా విజేతగా ప్రకటించి ఆ తర్వాత ఓడిన ప్లేయర్‌ను గెలిచినట్లు ప్రకటించారని కోచ్ పవన్ పేర్కొన్నాడు.
సంగారెడ్డి ప్లేయర్ చేతిలో ఓడిన ప్లేయర్‌ను తిరిగి పెద్దపల్లి నుంచి పోటీకి దింపడంతో పాటు తెలంగాణ వారికి ఫలితాల్లో తీవ్ర అన్యాయం చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జరిగిన అన్యాయంపై ప్రశ్నించినందుకు ఆంధ్రకు చెందిన సీఎం కప్ క్రీడల కార్యదర్శి కీర్తన్తో పాటు స్టేడియం ఇన్చార్జ్ అలెగ్జాండర్ తమపై దాడికి దిగినట్లు ప్లేయర్లు గోడు వెల్లబోసుకున్నారు. జగిత్యాలకు చెందిన 19 మంది ప్లేయర్లు సీఎం కప్ క్రీడలను బహిష్కరించడంతో పాటు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవి తెలంగాణ సీఎం కప్ పోటీలు కావని, ఆంధ్ర సీఎం కప్ టోర్నీ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బైఠాయించారు. తెలంగాణ క్రీడలపై ఆంధ్రవాళ్ల ఆధిపత్యం ఇంకా కనిపిస్తున్నదని పలువురు ప్లేయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.